/rtv/media/media_files/2026/03/27/police-fireing-2026-03-27-21-42-58.jpg)
Tadipatri Police Open Fire
Tadipatri Police Open Fire : అనంతపురం జిల్లాలో పోలీసుల ఫైరింగ్ కలకలం రేపింది. ఓ నిందితున్ని సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు కాల్పులు జరపాల్చి వచ్చింది. దీంతో నిందితుడు గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాడికి మండలం కోనఉప్పలపాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు వేం చంద్రను అతని బావ సర్వేశ్ కుమార్‌కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో సర్వేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు సర్వేశ్ కుమార్ పోలీసులపై తిరగబడి బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరపడంతో అతను గాయపడ్డాడు. దీంతో నిందితున్ని ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని యాడికి మండలం కోనఉప్పలపాడుకు చెందిన వేంచంద్ర అనే ఏడేళ్ల బాలుడి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వేంచంద్ర స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో వేంచంద్ర బుధవారం స్కూల్‌కు వెళ్లాడు.. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం స్కూల్ వదలగానే బస్సు డ్రైవర్ వేంచంద్రతో ఇతర పిల్లల్ని తీసుకెళ్లి వారి ఇంటికి సమీపంలో రోడ్డు పక్కన దింపి వచ్చాడు. దానితో వేంచంద్ర ఇంటికి బయల్దేరాడు.
అదే సమయంలో బాలుడి బావ అయిన సర్వేశ్ బాలుడికి ఎదురుపడ్డాడు. బాలుడికి తినుబండారాలను కొనిచ్చాడు.. అనంతరం మాయ మాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. అయితే స్కూల్ సమయం మించిపోయినప్పటికీ వేంచంద్ర ఇంటికి రాకపోవడంతో అటు స్కూల్ ఇటు పిల్లలను ఎంక్వరీ చేయగా అంతకు ముందే ఇంటికి వచ్చినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా..ఓ వ్యక్తి ముసుగు ధరించి బైక్‌పై రావడం, ఉప్పలపాడులోని ఓ షాపులో తినుబండారాలు కొనుగోలు చేసినట్టు రికార్డయింది. అదే సమయంలో బాలుడు చదవుతున్న స్కూల్ బస్సు రావడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అదే సమయంలో సర్వేశ్ బాలుడికి ఎదురువెళ్లి అతన్ని తీసుకెళ్లినట్లు కూడా అందులో రికార్డయింది. వెంటనే పోలీసులు తమదైన పద్ధతిలో ఆరా తీయగా ఈ హత్య వ్యవహారం బయటపడింది.. వెంటనే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎందుకు చంపాడంటే?
సర్వేశ్ ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో అత్తామామలు తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని వారిపై కక్ష పెంచుకున్నాడు. వారిమీద కక్ష్య తీర్చుకోవాలనే కోపంతో బావమరిది వేంచంద్రను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
పోలీసులపై దాడి
ఇక సర్వేశ్‌ను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకెళ్లిన సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సర్వేశ్ పోలీసులపై తిరగబడ్డాడు.. పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా, చెత్త కుప్ప పక్కన ఉన్న బీర్ బాటిల్ తీసుకుని పోలీసులపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు అప్రమత్తమై గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.. అయినా నిందితుడు ఏ మాత్రం బయపడకుండా పోలీసులపైకి దాడికి యత్నించడంతో అతడి మోకాళ్లపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. అయితే సర్వేశ్ దాడిలో సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. తేరుకున్న పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపడంతో .. సర్వేశ్ రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే నిందితున్ని ఆస్పత్రికి తరలించారు.. ఇటు గాయపడిన ఇద్దరు పోలీసుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Follow Us