AP News : ఏపీలో కొత్త నిప్పుల కొలిమిగా మారిన 'లైమ్‌సిటీ'.. దానికి గల కారణాలు ఇవే!

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'రెంటచింతల' ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాన్ని ఇపుడు 'పిడుగురాళ్ల' భర్తీ చేసింది. తాజాగా రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డుల కెక్కింది.

New Update
FotoJet - 2026-05-22T163210.904

'Lime City' has become a new hotbed of fire in AP.

AP News : ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు 'రెంటచింతల'. దశాబ్దాలుగా వేసవిలో రికార్డు స్థాయి వేడికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ప్రాంతం, ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుత వేసవి కాలంలో ఒక్కసారి కూడా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీనికి భిన్నంగా, మునుపెన్నడూ లేని విధంగా 45.9, 45.6, 46.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతూ, తాజాగా రికార్డు స్థాయిలో ఏకంగా 48.1 డిగ్రీల భీకర ఉష్ణోగ్రతతో 'పిడుగురాళ్ల' పట్టణం రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతంగా మారి నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

పిడుగురాళ్లను సాధారణంగా 'లైమ్‌సిటీ' (సున్నపు నగరం) అని పిలుస్తారు. ఈ పట్టణం చుట్టుపక్కల రాష్ట్రంలోనే ఎక్కడా లేనన్ని సున్నపు పరిశ్రమలు, సున్నపు బట్టీలు విస్తరించి ఉన్నాయి. ఈ బట్టీలలో సున్నపురాయిని కాల్చడానికి పెద్ద ఎత్తున బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇలా నిరంతరం బొగ్గును కాల్చడం వల్ల వాతావరణంలోకి విపరీతమైన వేడి వెలువడుతుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సున్నపు పరిశ్రమల నుంచి వచ్చే కృత్రిమ వేడికి, ఆకాశం నుండి కురిసే సూర్యుడి భగభగలు తోడవడంతో పట్టణంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి క్రమంగా 48 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి.

పరిశ్రమల ప్రభావం ఒకవైపైతే, పట్టణంలో పచ్చదనం పూర్తిగా కనుమరుగవడం ఈ వాతావరణ విపత్తుకు మరో ముఖ్య కారణం. ఇటీవల కాలంలో జరిగిన నలువైపుల రోడ్ల విస్తరణ పనులు పట్టణ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. జానపాడు రోడ్డు విస్తరణ, మాచర్ల జాతీయ రహదారి పనులు, అలాగే కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం మరియు బైపాస్ రోడ్ల కోసం వందలాది ఏళ్ల నాటి భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. రహదారుల అభివృద్ధి బాగానే ఉన్నప్పటికీ, నరికిన చెట్లకు ప్రత్యామ్నాయంగా అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ కనీసం ఒక్క కొత్త మొక్కను కూడా నాటకపోవడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ పిడుగురాళ్ల మండల వ్యాప్తంగా ఉన్న పచ్చదనంపై సమగ్రమైన సర్వే నిర్వహించింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 341 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ మండలంలో పర్యావరణ సమతుల్యత కోసం కనీసం 68,259 మొక్కలు ఉండాలి. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే కేవలం 19 కిలోమీటర్ల పరిధిలో కేవలం 3,814 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయి. దీనికి తోడు పట్టణ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్ల ఏర్పాటు కోసం ఉన్న చెట్లను నరికేసి భూములను చదును చేస్తున్నారు. చుట్టుపక్కల పొలాల్లో పంటలు వేయకుండా ఖాళీగా వదిలేయడం కూడా భూమి త్వరగా వేడెక్కడానికి కారణమవుతోంది.

భవిష్యత్తులో పిడుగురాళ్ల పట్టణం మరింత అగ్నిగుండంగా మారకుండా ఉండాలంటే.. పచ్చదనం పెంపునకు స్థానిక ప్రజలు, వ్యాపారులు మరియు అధికారులు కలిసికట్టుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిబంధనల ప్రకారం.. సున్నపు పరిశ్రమలు ఉన్న మొత్తం స్థలంలో కనీసం 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు పెంచాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా నిరంతరం తనిఖీలు మరియు పర్యవేక్షణ చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు