Road accident : ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఇన్నోవా క్రిస్టా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
FotoJet (20)

Road accident

 Road accident : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లి వస్తుండగా, కొత్తపల్లి గ్రామ శివారులోని జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగ్గంపేటలోని ఒక ట్రావెల్స్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కోసం తీసుకున్న ఈ వాహనంలో ప్రమాద సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని మల్లిసాల గ్రామానికి చెందిన కొండిపూడి వివేక్ (19), బల్లిలా పద్మ (19), మూడేళ్ల చిన్నారి కందిగట్ల లక్కీగా గుర్తించారు. విహారయాత్ర ముగించుకుని స్వగ్రామమైన మల్లిసాలకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణ, కందిగట్ల నాని, రామకృష్ణ దొర, దుర్గ, నవ్యలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే గోకవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, అందులోనూ ఇద్దరు యువతీయువకులు, ఒక చిన్నారి మృతి చెందడంతో మల్లిసాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు