AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

New Update
FotoJet - 2026-05-03T081342.528

AP liquor case

AP liquor case : వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌( ఐటీ) కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. దుబాయ్‌కి 2 వేల కోట్ల నగదు హవాలా రూపంలో తరలించడంతో పాటు  డిస్టిలరీలు నగదు రూపంలో లావాదేవీలు చేసి పన్ను ఎగవేసినట్టు ఐటీకి ప్రాథమిక సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈడీ విచారణలో బయటపడ్డ అంశాల ఆధారంగానే  ఐటీ ఈ విషయాలపై ఫోకస్‌ చేసినట్టు సమాచారం.

పన్ను ఎగవేత కోసం ఏపీ బెవరేజేస్‌ కార్పొరేషన్‌కు లిక్కర్‌ సప్లైలో కీలకంగా వ్యవహరించిన రెండు డిస్టిలరీలు కావాలనే వాటి సరఫరాదారులకు ఎక్కువ పేమెంట్‌లు చేశారని ఐటీకి ప్రాథమిక ఆధారాలు లభించాయి. నిజానికి డిస్టిలరీలకు ఎలాంటి మెటీరియల్‌ సరఫరా లేకపోయినప్పటికీ  ఈ లావాదేవీన్నింటికి ఫేక్‌ ఇన్‌ వాయిస్‌లు క్రియేట్‌ చేసి నగదు తరలించినట్టు ఐటీ భావిస్తోంది.  రోజుకు 70 కోట్ల దాకా నగదును ఈ పద్ధతిలో జనరేట్‌ చేస్తూ హవాలా రూపంలో దుబాయ్‌కు తరలించినట్టు ఐటీకి సమాచారం లభించింది. పన్ను చెల్లింపులు తప్పించుకోవడానికే మొత్తం లాభాలను బ్లాక్ మనీగా దాచిపెట్టినట్లు ఐటీ గుర్తించింది. పన్నుఎగవేతతో పాటు ఫేక్ లావాదేవీలు చేసినందుకు డిస్టిలరీల యజమానులపై ఐటీ త్వరలో కేసు నమోదు చేసి వారికి నోటీసులిచ్చి విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది.  మనీలాండరింగ్‌ కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లిక్కర్‌ స్కామ్ విచారణకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఐటీకి పంపింది. ఆదాయ పన్ను ఎగవేతపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలితే కేసు నమోదు చేసి  పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఐటీ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

వైసీపీ పవర్‌లో ఉన్న ఐదేళ్లలో డిస్టిలరీల నుంచి వాటి సప్లైయర్లకు సుమారు రూ. 2 వేల కోట్ల మేర అక్రమ సంపాదన చేతులు మారినట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భారీ మొత్తానికి సంబంధించిన పన్ను చెల్లింపుల వ్యవహారంపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈడీ పంపిన పత్రాల ఆధారంగా పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో ఐటీ అధికారులు లోతుగా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ ఇక లిక్కర్ కేసులో విచారణ జరపనుండడంతో కేసులో ఎలాంటి సంచలనాలు బయటపడతాయనేది ప్రస్తుతం కీలకంగా మారింది.

ఇటీవల లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు ప్రధాన నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విషయంలో వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై మాజీమంత్రి కారుమూరి నాగేశ్వర్‌రావుకు నోటీసు ఇచ్చి ఈడీ విచారణ జరిపింది. ఇలా లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ తాజాగా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఐటీ ఎంట్రీ ఇస్తే విచారణ మరింత స్పీడప్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో ఇన్వాల్వ్‌ అయిన ప్రధాన నిందితులతో పాటు కేసుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్న వైసీపీ నేతల్లో గుండెల్లో గుబులు మెదలైనట్టు సమాచారం. 

వైసీపీ హయాంలో ప్రభుత్వానికి అంటే ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ప్రముఖంగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌,  నీల డిస్టిలరీస్‌, అంబర్‌ స్పిరిట్స్‌, అదాన్‌ డిస్టిలరీస్‌, తిలక్‌నగర్‌, మోహన్, ఎస్‌ఎన్‌జే లాంటి డిస్టిలరీలు లిక్కర్‌ సప్లై చేశాయి. వీటిలో ప్రముఖంగా ఎస్పీవై,  అదాన్‌ డిస్టిలరీలే హవాలా రూపంలో వేలకోట్లు తరలించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ఇప్పటికే అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్పీవైతో పాటు అదాన్‌ డిస్టిలరీ ఓనర్లు ఎవరైనప్పటికీ వీటిని లీజుకు తీసుకొని అసలు కథ ఎవరు నడిపారనేదానిపై చాలా ఆరోపణలున్నాయి.  2019లో రూ.లక్ష పెట్టుబడితో అదాన్‌ డిస్టిలరీలను శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి కలిసి ప్రారంభించారని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు.

 వీరిలో రోహిత్‌ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడని ప్రచారం జరిగింది. ఇక  అదాన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్లుగా పేర్కొన్న శ్రీనివాస్‌, బొలారం శివకుమార్‌ బినామీలని,  హైదరాబాద్‌ మియాపూర్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ ప్రధాన కార్యాలయం అడ్రస్‌ను అదాన్‌ కంపెనీ  చిరునామాగా పేర్కొన్నట్టు ప్రచారం జరిగింది.  అదాన్‌ యజమానులు చిన్న చిన్న డిస్టలరీ యజమానులను బెదిరించి వారి డిస్టలరీలను లీజు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ డిస్టిలరీ నిర్వహణ వెనుక చిత్తూరుకు చెందిన రెడ్డి నేతలు, చెన్నైకి చెందిన అదే సామాజిక వర్గ వ్యక్తుల ప్రమేయం ఉందన్న ప్రచారం జరిగింది.  దీంతో ఇప్పుడు ఈ రెండు డిస్టిలరీలపై ఐటీ విచారణ జరిపితే వైసీపీలో కీలక వ్యక్తులు ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయన్నదానిపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది.

 మరోవైపు వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జగన్‌ హయాంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్‌తో పాటు భారతి సిమెంట్స్‌ ఫైనాన్స్‌ వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప తదితరులను సిట్‌ అరెస్ట్‌ చేసి విచారించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ ఇప్పటికే ప్రధాన ఛార్జ్‌షీట్‌తో పాటు పలు అనుబంధ ఛార్జ్‌షీట్‌లు కూడా దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. లిక్కర్‌స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్‌కెసిరెడ్డిగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 

#sajjala #income-tax #sit #Enforcement Directorate #ap liquor #ap liquor case
Advertisment
తాజా కథనాలు