/rtv/media/media_files/2024/11/04/0PlUEDu2HdCekEZM1bbx.jpg)
తండేల్ (Thandel) సినిమా ఎఫెక్ట్ తో ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 'ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సుల్లో అనుమతి లేని పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు వంటివి ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అంశంపై అన్ని డిపో మేనేజర్లు, అధికారులు మార్గదర్శకాలు పాటించాలంటూ ఈడీ (ఆపరేషన్స్) అప్పలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అధికారులు కచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ అద్దె బస్సుల్లో అనుమతి లేని సినిమాలను ప్రదర్శిస్తే ఆ బస్సును నిలిపివేస్తారు. ఈ నెల 9వ తేదీ రాత్రి పలాస నుంచి విజయవాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ అద్దె బస్సు (ఏపీ39డబ్ల్యూబి 3637)లో తండేల్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఓ ప్రయాణికుడు టెక్కలిలో ఈ బస్సు ఎక్కాడు. వెంటనే తన మొబైల్‌లో ఉన్న పైరసీ సినిమా (Pirated Movie) ను బ్లూటూత్ ద్వారా బస్సులోని స్మార్ట్‌టీవీకి కనెక్ట్ చేసి ప్రదర్శించాడు. ఈ సినిమాను రణస్థలం నుంచి విశాఖకు సమీపంలోని తగరపువలస వరకు ప్రదర్శించారు. ఆ తర్వాత విశాఖలో ఆ ప్రయాణికుడు దిగిపోయాడు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం రంగంలోకి దిగి చర్యలు తీసుకుంది.
Pirated Movie In APSRTC Bus
ఈ సినిమా ప్రదర్శన తర్వాత.. ఈ నెల 11 నుంచి ఆ బస్సును వినియోగించడం లేదు. తండేల్ సినిమాను బస్సులో ప్రదర్శించిన యువకుడు ఎవరనేది గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 'బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించినట్లు నిర్మాత బన్నీవాసు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించాం. పలాస డిపోకు చెందిన అద్దె బస్సును సర్వీసు నుంచి తొలగించాం' అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు వివరించారు.
ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సు యజమానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సినిమా పైరసీ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. తండేల్ సినిమా విడుదలైన తర్వాత ఇది రెండో సారి బస్సులో ప్రదర్శించడం. జనవరిలో విడుదలైన రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీని పైరసీ చేసి వేశారు. ఇలా వరుస ఘటనలతో ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రొడ్యూసర్ బన్నీ వాసు తండేల్ సినిమా పైరసీ చేసి బస్సులో ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుకి ఫిర్యాదు చేశారు. AP 39 WB 5566 నంబర్ ఏపీఎస్ ఆర్టీసీ బస్‌లో తండేల్ సినిమా పైరసీని ప్రదర్శించడంపై ఆధారాలతో సహా బన్నీ వాసు ట్వీట్ చేశారు. ఇండస్ట్రీకి ఇలాంటివి మంచిది కాదని.. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని ఇలా చేయడం అంటే అగౌరవ పరచినట్లే అని అన్నారు.
Also Read: horoscope Today: ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి!
Also Read: UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి