Waqf Bill 2024 : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా . .ఆ ఓటు బ్యాంకు కోసమా ?

వైసీపీ ఏర్పడిన తరువాత తొలిసారిగా కేంద్రంలో ఒక బిల్లును వ్యతిరేకించింది. దీనికి కారణం ఇండియా కూటమికి దగ్గర కావడానికే అని ఒక వర్గం పరిశీలకులు అంటున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీకి దూరం అయిన మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే అని కొందరు విశ్లేషిస్తున్నారు. 

New Update
Waqf Bill 2024 : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా . .ఆ ఓటు బ్యాంకు కోసమా ?

AP Politics : ఏపీ రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే ఎవరికీ అంతుచిక్కనివిగా మారిపోయాయి. నిజానికి 2019 ఎన్నికలకు ముందు నుంచే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటూ వచ్చాయి. ప్రధాన పార్టీల మధ్య విచిత్ర సంబంధాలు గత ఆరేళ్లుగా కనిపిస్తూ వస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు సరికొత్త అర్ధం చెబుతున్నాయి. అయితే, రాజకీయ నాయకులను మించి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల వ్యవహారం నడుస్తోంది. తలలు పండిన వారికి కూడా అర్ధం కాని విధంగా ఎన్నికల సమయంలో ప్రవర్తిస్తున్నారు ఏపీ ప్రజలు. ఇక ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు విచిత్రంగా చెక్ పెడుతున్నారు. ఆ దెబ్బతో నాయకులు ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో పడ్డారు. తాజా ఎన్నికలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, మొట్ట మొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) తన ముసుగు స్నేహితుడి ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఎన్నికల ముందు వరకూ ఎవరు ఎవరికీ మిత్రులో తెలియని విధంగా నడిచిన ఏపీ రాజకీయం.. పవన్ కళ్యాణ్ పట్టుదలతో.. కూటమి ఏర్పాటు జరిగిపోయింది. అప్పటివరకూ టీడీపీకి దూరంగా.. వైసీపీకి దగ్గరగా ఉన్న బీజేపీ యూ టర్న్ తీసుకుని జనసేనతో కలిసి, టీడీపీని కలుపుకుని కూటమిగా ఎన్నికల బరిలో దిగింది. టీడీపీని అధికారానికి చేర్చింది. 

Waqf Bill 2024 : అధికారంలో ఉన్న ఐదేళ్లూ బీజేపీని కేంద్రంలో సమర్ధిస్తూ.. ఆ పార్టీ అవసరానికి అడిగినా.. అడగకపోయినా మేమున్నాం అంటూ సపోర్ట్ ఇస్తూ వచ్చింది వైసీపీ. చాలా సందర్భాల్లో రాజ్యసభలో కేంద్ర బిల్లులు ఆగిపోతాయి అనే పరిస్థితిలో వైసీపీ సపోర్ట్ తోనే బయటపడిన సంగతీ తెలిసిందే. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పిన వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏరోజూ కేంద్రంతో గట్టిగా దెబ్బలాడింది లేదు. రాష్ట్రం కోసం ఇది ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిన సందర్భాలు లేవు. ఇదంతా గతం. ఐదేళ్ల తరువాత బళ్ళు ఓడలయ్యాయి. వైసీపీ తన తప్పులకు మూల్యం చెల్లించుకుంది. పదకొండు సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతిపక్షంలో కూచుంది. బీజేపీ రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నాసరే.. బీజేపీ (BJP) కే మా మద్దతు అంటూ మొన్నటి స్పీకర్ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులూ బహిరంగంగానే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి కేంద్రంతో కయ్యం పెట్టుకునే ఉద్దేశ్యం లేదని అందరూ అనుకున్నారు. 

కానీ, అకస్మాత్తుగా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. అంటే కేంద్రంలోని బీజేపీతో ఇకపై కలిసి ఉండేది లేదని స్పష్టం చేసినట్లయింది. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పింది. అంటే.. వైసీపీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరవుతుందని అనుకోవచ్చా? ఈ ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు కూడా మిశ్రమ సమాధానం చెబుతున్నారు. బిల్లును వ్యతిరేకించడం అంటే, కాంగ్రెస్ కు దగ్గరగా జరగడం ఎలా అవుతుంది అని కొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం.. ఇండియా కూటమికి దగ్గర అవుతున్న సంకేతాలు పంపడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారని అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ ఒక పక్షంగా ఉంది. అటువంటప్పుడు బీజేపీని సమర్ధించడం సరైన పనికాదు. రాజకీయంగా ఇబ్బందులు సృష్టించవచ్చు. అందుకే, బీజేపీకి దూరంగా ఉన్నట్లు కనిపించాలని బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ చెప్పిందని అంటున్నారు. 

ఆ ఓటు బ్యాంకు కోసమేనా?
కానీ, మరో వాదన కూడా వినిపిస్తోంది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారనేది ఆ వాదనగా ఉంది. ఎందుకంటే, ఏపీలో ముస్లింలు కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. వైసీపీ (YCP) వచ్చిన తరువాత వారంతా వైసీపీ వైపు జరిగిపోయారు. వైసీపీని 2019 ఎన్నికల్లో గెలిపించడంలో ముస్లింలది కూడా కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఆ తరువాత కూడా ముస్లింలు వైసీపీ వెంటే ఉన్నారు. కానీ, 2024 ఎన్నికల సమయంలో మాత్రం పరిస్థితులు మారిపోయాయి. గత ఎన్నికల్లో దాదాపుగా 20 స్థానాల్లో ముస్లిం ఓట్లతోనే వైసీపీ గెలిచి అధికారానికి దగ్గరైంది. ఈ ఎన్నికల్లో ఆ స్థానాలన్నిట్నీ కోల్పోయింది వైసీపీ. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు తమ పార్టీని వదిలేశారని జగన్మోహన్ రెడ్డికి అర్ధం అయింది. ఇప్పుడు ముస్లింల మద్దతు.. అభిమానం తిరిగి పొందడం కోసమే జగన్ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారని అంటున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా అటు ముస్లిం ఓటు బ్యాంకును ఒడిసిపట్టుకోవాలనే ఆలోచన చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు బీజేపీతో ఇతర బిల్లుల విషయంలో సఖ్యతతోనే పోయే అవకాశాలున్నాయని.. అంశాల వారీ మద్దతు పద్ధతిలో పూర్తిగా కాకుండా బీజేపీకి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. 

మొత్తంగా చూసుకుంటే, ఎన్నికల్లో ఓటమి తరువాత ఐదేళ్లుగా ముసుగులో ఉన్న బీజేపీ-వైసీపీ స్నేహ బంధం తెగిపోవడానికి సిద్ధం అవుతున్నట్టే కనిపిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు వైసీపీ కాంగ్రెస్ కు దగ్గరయ్యే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఏదిఏమైనా వక్ఫ్ ఇక బిల్లును వ్యతిరేకించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారనే చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్ కోరుకుంటున్నట్టు దూరం అయిన ముస్లిం ఓటర్లు వైసీపీకి దగ్గర అవుతారా? కేంద్రంలోని ఒకప్పటి ముసుగు మిత్రుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా మైనార్టీలకు బలమైన సంకేతం పంపించారని చెప్పుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Also Read : ధనుష్ కు జోడిగా ‘ఆదిపురుష్’ బ్యూటీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు