Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి పొంగులేటి!

తెలంగాణలో జూన్ 19 నుంచి రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

New Update
rains

rains

తెలంగాణలో జూన్ 19 నుంచి రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నైరుతి రుతుపవనాలు జూన్ 8న గద్వాల జిల్లా మీదుగా ప్రవేశించి.. ఇప్పటికే దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఇవి రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 49.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 10 శాతం తక్కువ. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా జూన్ 18 నుంచి 20 మధ్య కొన్ని చోట్ల 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర సేవల కోసం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు