/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
Chiranjeevi
Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న కీలక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సోమవారం హై-వోల్టేజ్ సమావేశాలు జరిగాయి. థియేటర్ల మనుగడ, ఎగ్జిబిటర్ల కష్టాలు, ఇండస్ట్రీ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. మొదట ఆయన తెలంగాణ ఎగ్జిబిటర్లతో గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే గిల్డ్ నిర్మాతల ప్రతినిధులను కూడా చిరంజీవి తన నివాసానికి పిలిపించుకున్నారు. ఎగ్జిబిటర్లతో చర్చలు ముగిసిన అనంతరం గిల్డ్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హాజరైన ప్రముఖులుఈ కీలక సమావేశంలో టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో దిల్ రాజు (ప్రముఖ నిర్మాత), సురేష్ బాబు (ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్), అల్లు అరవింద్ ,కె.ఎల్. నారాయణ (నిర్మాత), శ్రీధర్ (ఎగ్జిబిటర్ల ప్రతినిధి)తో పాటు పలువురు తెలంగాణ ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు, ఎగ్జిబిటర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులను, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న నష్టాలు, ఇతర సమస్యలను చిరంజీవికి కూలంకషంగా వివరించినట్లు వారు తెలిపారు.
"సింగిల్ స్క్రీన్ థియేటర్లు పడుతున్న ఇబ్బందులు ఇన్ని ఉన్నాయా అని చిరంజీవి గారు ఆశ్చర్యపోయారు. సమస్యలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకున్నారు. మొన్న ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలోని అన్ని వివరాలను కూడా చిరంజీవి పరిశీలించారు." అని ఎగ్జిబిటర్ శ్రీధర్ తెలిపారు.ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదని, యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్య అని దిల్ రాజు స్పష్టం చేశారు. సమస్యలపై చిరంజీవి రెస్పాన్స్ చాలా సానుకూలంగా ఉందని, రెండు మూడు రోజుల్లో ఫిల్మ్ ఛాంబర్ నుండి అధికారికంగా అన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.
టాలీవుడ్ సమస్యల పరిష్కారంలో భాగంగా తదుపరి అడుగు పడనుంది. రేపు (మంగళవారం) సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల బృందం భేటీ కానుంది.చిరంజీవితో జరిగిన చర్చల్లో వ్యక్తమైన అంశాలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను ఈ భేటీలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో పరిశ్రమను మళ్లీ గాడిలో పెట్టేందుకు టాలీవుడ్ పెద్దలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
సినిమా ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకునే విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ప్రధానంగా రెండు విధానాలపై భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాల విడుదల సమయంలో పర్సంటేజ్ విధానంలోనే వెళ్లాలని నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, థియేటర్ల నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) భారీగా పెరిగిపోవడంతో, కేవలం పర్సంటేజ్ నమ్ముకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతాయని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ వాదిస్తోంది.ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య, సమస్య తీవ్రతను వివరించేందుకు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇండస్ట్రీలో అందరికీ ఆమోదయోగ్యుడైన మెగాస్టార్ చిరంజీవిని ఆశ్రయించారు. మొన్నటివరకు ఈ పర్సంటేజ్ వివాదంపై ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడిచినా, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో చర్చలు జరగడంతో ఈ సమస్యకు త్వరలోనే ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Follow Us