/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-11-23-43.jpg)
Fake Currency
Fake Currency : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో బుధవారం ఉదయం దొంగనోట్ల కలకలం రేగింది. లచ్చాపురం గ్రామ శివారులోని కొర్రాజుల చెరువు సమీపంలో పెద్ద ఎత్తున రూ. 500 లకు చెందిన నకిలీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. నిర్మానుష్యంగా ఉండే చెరువు కట్ట ప్రాంతంలో ఒక్కసారిగా నోట్లు దర్శనమివ్వడంతో గ్రామస్తులు తొలుత ఆశ్చర్యానికి గురై, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్సై బాలస్వామి తన సిబ్బందితో కలిసి ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చేపట్టి, అక్కడ పడి ఉన్న నోట్లన్నింటినీ ఏరివేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో ఇవి నకిలీ నోట్లుగా (Fake Currency) పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల తనిఖీల్లో ఆ నోట్లు ముద్రించిన కాగితం నాణ్యత, ఇతర భద్రతా ఫీచర్లలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గమనించో లేదా దొరికిపోతామనే భయంతోనో గుర్తుతెలియని వ్యక్తులు ఈ నోట్లను ఇక్కడ పారేసి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్ల మొత్తం విలువ ఎంత ఉంటుందనేది లెక్కిస్తున్నారు.
ఈ ఘటనపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ నోట్ల ముఠా మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రాంతంలోకి ఈ నోట్లు ఎలా వచ్చాయి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఎవరైనా వీటిని తీసుకొచ్చారా అనే కోణంలోనూ తనిఖీలు చేపట్టారు. గ్రామ శివారులో దొంగనోట్లు ప్రత్యక్షం కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు.
Follow Us