/rtv/media/media_files/2025/03/17/SvW5RadD8M6IGesLWlNN.jpg)
Telangana Assembly
రేవంత్ సర్కార్ అసెంబ్లీలో సోమవారం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు, అలాగే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ రెండు బిల్లులకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో వీటిని అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభతో పాటు శాసన మండలిలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరగనుంది.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
ఇటీవల రాష్ట్ర సర్కార్ కులగణన సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. బీసీ జనాభా ప్రకారం వారికి సామాజిక న్యాయం కల్పించడం కోసం 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది. పస్తుతం రాష్ట్రంలో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25 శాతం ఉండగా.. ముస్లింలకు బీసీ-ఈ కేటగిరి కింద 4 శాతం అమలవుతోంది. అయితే ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచే బిల్లును ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్.
మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలసిందే. దీంతో తెలంగాణలో వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అలాగే భవిష్యత్తులో దీనిపై న్యాయవివాదాలు తలెత్తకుండా ఉండటం కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.
Also Read: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
ఈ కమిషన్ ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించింది. ఈ వివరాలను ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణపై కులసంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాత కమిషన్ ప్రభుత్వాని రిపోర్టు ఇవ్వడంతో.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.