Online betting : ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. నకిలీ బంగారంతో రూ.1.48 కోట్లు ముంచేసిన బ్యాంక్ మేనేజర్!

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్.. ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.48 కోట్ల రుణం పొందాడు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.31.35 లక్షల నగదును కూడా స్వాహా చేశాడు.

New Update
FotoJet - 2026-05-13T071720.916

Bank manager cheating

Online betting : ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఓ బ్యాంక్ మేనేజర్.. తాను పని చేస్తున్న సంస్థకే భారీ కన్నం వేశాడు. ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.48 కోట్ల రుణం పొందాడు. అంతటితో ఆగకుండా బ్యాంక్ ఏటీఎంలలో ఉంచాల్సిన రూ.31.35 లక్షల నగదును కూడా స్వాహా చేశాడు. ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాలను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేశ్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మూడు నెలలకే బుద్ధి గడ్డితిన్నదిలా..

మెదక్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ప్రాంగణంలో గతేడాది జూన్ నెలలో 'ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్' శాఖ ఏర్పాటైంది. దీనికి కామారెడ్డికి చెందిన యాదం అనిల్ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అయితే, బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే అనిల్‌కు దుర్బుద్ధి పుట్టింది. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో అప్పులపాలైన అతను బ్యాంక్‌ను మోసం చేయాలని పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం సహా కామారెడ్డికి చెందిన పరిచయస్థుల పేరిట బ్యాంకులో 16 నకిలీ ఖాతాలను తెరిచాడు.

వన్ గ్రామ్ గోల్డ్‌ను అసలు బంగారంగా చూపి..

ఆయా ఖాతాల ద్వారా 'వన్ గ్రామ్ గోల్డ్' (నకిలీ) నగలను బ్యాంకులో కుదువ పెట్టి రూ.1.48 కోట్ల మేర గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఈ మోసంలో మెదక్‌కు చెందిన బ్యాంక్ బంగారం నాణ్యత పరిశీలకుడు (గోల్డ్ అప్రైజర్) శ్రీనివాసచారి కూడా చేతులు కలిపాడు. అనిల్‌తో కుమ్మక్కైన అతను, ఆ నకిలీ నగలను నిజమైన బంగారంగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ ఇచ్చి సహకరించాడు. లోన్ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో వేసి, చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలను అనిల్ తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఖాతాకు మళ్లించాడు. ఇవే కాకుండా, బ్యాంక్ బయట ఉండే రెండు ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సమయంలో మేనేజర్ అనిల్ తన చేతివాటం ప్రదర్శించి రూ.31.35 లక్షలను నొక్కేశాడు.

సైబర్ పోర్టల్ సీజ్‌తో వెలుగులోకి..

మేనేజర్ భార్య స్రవంతి బ్యాంక్ ఖాతా సైబర్ పోర్టల్‌లో హఠాత్తుగా సీజ్ కావడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన బ్యాంక్ ఉన్నతాధికారులు మెదక్ శాఖకు వచ్చి ఆమె ఖాతాను, ఆమె కుదువపెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆ శాఖలోని మొత్తం 199 గోల్డ్ లోన్ ఖాతాలను సమగ్రంగా తనిఖీ చేయించగా, 16 ఖాతాల ద్వారా నకిలీ బంగారంతో మోసం జరిగినట్లు రుజువైంది.

ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో ప్రధాన సూత్రధారి

బ్యాంకు సీఈఓ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మోసానికి సహకరించిన మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, గోల్డ్ అప్రైజర్ శ్రీనివాసచారిలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడైన మేనేజర్ యాదం అనిల్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గతంలోనూ జైలుకెళ్లిన ఘనుడు!

నిందితుడైన అనిల్‌కు ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు 'ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్' మేనేజర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇతను చేతివాటం ప్రదర్శించాడు. అక్కడ అమాయకులైన పోలవరం నిర్వాసితులను, గిరిజనులను మోసం చేసి రూ.11.82 లక్షలు స్వాహా చేయడంతో అప్పట్లో ఇతనిపై కేసు నమోదై జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు