Cyber Crime : సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్: గ్యాస్ కస్టమర్లే టార్గెట్..సీపీ హెచ్చరిక!

గ్యాస్ సిలిండర్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంజా విసురుతున్నారు. మీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ చేయాలి.. లేకపోతే సప్లై ఆగిపోతుంది అంటూ నమ్మించి

New Update
sajjanar

గ్యాస్ సిలిండర్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంజా విసురుతున్నారు. మీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ చేయాలి.. లేకపోతే సప్లై ఆగిపోతుంది అంటూ నమ్మించి, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఒక APK ఫైల్ పంపిస్తున్నారు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేసి ఆ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశారో.. ఇక మీ కష్టార్జితం మొత్తం నిమిషాల్లో ఆవిరైపోవడం ఖాయం. ఈ మేరకు హైదరాబాద్ సీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ట్వీట్ చేశారు. 

ఏకంగా 4 లక్షల రూపాయలు

తాజాగా మహారాష్ట్రలోని డోంబివాలిలో ఇద్దరు మహిళలు ఈ మాయలో పడి ఏకంగా 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. గ్యాస్ కంపెనీ ప్రతినిధులమని ఫోన్ చేసిన నేరగాళ్లు, ఒక ఫారం నింపాలని చెప్పి ఏపీకే ఫైల్ పంపారు. ఆ మహిళలు ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేయగానే, వారి బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు మాయమయ్యాయి. నేరగాళ్లు పంపే ఈ యాప్స్ మీ ఫోన్‌లోకి చేరగానే, మీ మొబైల్ కంట్రోల్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుంది. మీ ఫోన్‌కు వచ్చే OTPలు, బ్యాంక్ మెసేజ్‌లు వారికి నేరుగా కనిపిస్తాయి. దీనివల్ల మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేస్తారు.

వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకండని సజ్జనార్  తెలిపారు.  కేవైసీ కోసం ఎప్పుడూ గ్యాస్ కంపెనీ అధికారిక యాప్స్ (ఉదాహరణకు: IndianOil One, HP Pay, BPCL Hello BPCL) లేదా నేరుగా గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుకే వెళ్లండని సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పుడూ వాట్సాప్‌లో ఫైల్స్ పంపి వివరాలు అడగవని,   ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ఆయన  సూచించారు. 

Advertisment
తాజా కథనాలు