/rtv/media/media_files/2025/01/20/NUJVzKPUGsoyWUM3hABf.jpg)
kabaddi coach sampath
Kabaddi: కబడ్డీ అంటే అతనికి చాలా ఇష్టం. జాతీయ స్థాయిలో ఆడాలనుకున్న తన కల ఆర్థిక ఇబ్బందుల వల్ల కలగానే మిగిలిపోయింది. దీంతో లారీ డ్రైవర్‌గా బతుకు దెరువు మెుదలుపెట్టాడు. కానీ తనకున్న నైపుణ్యాలను ఎంతోమందికి నేర్పించి గొప్ప కబడ్డీ క్రీడాకారులను తయారు చేశాడు. అయితే ఆ గురువు ఇటీవల అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారంతా గుండెలు పగిలేలా ఏడ్చారు. అతని చివరి మజిలిని వినూత్నంగా జరిపించాలని నిర్ణయం తీసుకున్న శిష్యులు.. దహన సంస్కారాలను కబడ్డీ కోర్టులోనే జరిపించారు. కబడ్డీ గురువుకు ఘన నివాళులు అర్పించిన ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
కలిసిరాని కాలం..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కబడ్డీ కోచ్ పులికాశి సంపత్ కు చిన్నప్పటినుంచి కబడ్డి అంటే మక్కువ. తాను ఈ క్రీడలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. కానీ కాలం కలిసిరాకపోవడంతో తన కోరికను చంపుకుని కుటుంబ బాధ్యతలు ఎత్తుకున్నాడు. కానీ తన గోల్ మరిచిపోలేదు. చౌటపల్లిలోనే యువతను ప్రోత్సహించి కబడ్డీ నేర్పించి వివిధ టోర్నమెంట్ లకు పంపించిన సంపత్ ను విధి ఓర్వలేదు. సంక్రాంతి పండుగ రోజు హుస్నాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో తోటి మిత్రులు, గ్రామస్థులు ఆ కబడ్డీ ప్రేమికుడి అంత్యక్రియలను వినూత్నరీతిలో నిర్వహించారు. క్రీడాకారుడి చితికోసం కబడ్డీ కోర్ట్ ఏర్పాటు చేసి అందులో దహన సంస్కారాలు జరిపించారు.
కబడ్డీ కోర్ట్ లోనే చితి పేర్చి..
ఇక తమకు కబడ్డీ ఎవరు నేర్పిస్తారంటూ మృతదేహంపై పడి యువతీయువకులు రోధించారు. తమ జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసిన గురువు ఇక లేడనే బాధతో తల్లడిల్లినవారిని చూసి గ్రామస్థులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. గ్రామస్తుల సహకారంతో కబడ్డీ కోర్డు గీయించి అందులోనే సంపత్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ కోచ్ లేని లోటు తీరలేనిదంటూ ఘనంగా నివాళి అర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు.