/rtv/media/media_files/2026/03/10/fotojet-29-2026-03-10-10-01-37.jpg)
Former members distance themselves from the BRS party.
BRS party : ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కనీసం 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే గులాబీ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఈ ఓటమితో పార్టీ అధిష్టానం తీవ్ర నిరాశలో ఉండగా, ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఉద్దండులైన మాజీ మంత్రులు మున్సిపోల్స్ ముగిసి దాదాపు నెల కావొస్తున్నా తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గెలుపు గుర్రాలుగా భావించిన చోట కూడా పార్టీ ఓటమి పాలు కావడంతో, అందుకు బాధ్యులెవరన్న దానిపై పార్టీ లోపల అంతర్గత కుమ్ములాటలు మొదలైనట్లు తెలుస్తోంది.
ఇటీవల రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాగునీటి కష్టాలు, యూరియా కొరత, నెరవేరని హామీలను అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లినా ఫలితం మాత్రం నిరాశాజనకంగానే ఉంది. 116 మున్సిపాల్టీలు, 2582 వార్డులకు బీఆర్ఎస్ 18 మున్సిపాల్టీలు, 718 వార్డులను గెలుచుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాల్టీలు, ఉమ్మడి వరంగల్ జిల్లా 11 మున్సిపాల్టీలు, ఉమ్మడి నిజామాబాద్ లో 7 మున్సిపాల్టీలు ఉండగా ఆయా జిల్లాల్లో ఒక్క మున్సిపాల్టీ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాల్టీలకు గాను 3, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాల్టీలకు గాను రెండు వాయిదా పడగా మిగతా వాట్లో కేవలం ఒక్క మున్సిపాల్టీతోనే బీఆర్ఎస్ సరిపెట్టుకున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాల్టీలు ఉండగా ఒక్క మున్సిపాల్టీనే బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఉమ్మడి మహబూబ్ నగరలో 19 మున్సిపాల్టీలుండగా రెండు మున్సిపాల్టీల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అయితే 30కి పైగా మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్‌కు రిపోర్టులు ఇచ్చిన మాజీ మంత్రులు, ఇప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వెనుకబాటుపై గులాబీ దళపతి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఎక్కడ లోపం జరిగింది? గెలుస్తామనుకున్న చోట ఓటమికి గల కారణాలేంటి? అనే అంశాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రుల సొంత నియోజకవర్గాల్లోనే పార్టీ ఆశించిన స్థాయిలో మున్సిపాల్టీలు గెలవకపోవటంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
మున్సిపోల్స్ వైఫల్యానికి మాజీ మంత్రులదే బాధ్యత అనే ప్రచారం పార్టీలో మొదలవ్వడంతో సదరు మాజీ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలత ఉండటం సహజమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేవలం తమనే తప్పు పట్టడం ఏంటని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్... తెలంగాణ భవన్ వైపు రావడమే మానేశారు. ఇంతకు ముందు ప్రభుత్వ విధానాలు, ఏదో ఒక సమస్యపై ప్రతిరోజూ మీడియా సమావేశం నిర్వహించే మాజీ మంత్రులు మున్సిపల్ ఎన్నికలు ముగిసి దాదాపు నెల కావొస్తున్నా పార్టీ కార్యాలయం వైపు చూడటమే మానేయటంపై పార్టీల్లో చర్చ జరుగుతుంది.
తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు రాకపోవటంతో క్షేత్రస్థాయిలో ఉన్న గులాబీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసిన నేతలు, ఫలితాలు రాగానే మౌనంగా ఉండటం కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఎక్స్ మినిస్టర్స్ మౌనం వీడితేనే పార్టీలో మళ్లీ ఉత్సాహం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే మున్సిపల్ సెగ బీఆర్ఎస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 రూపాయలు, పింఛన్ల పెంపు వంటి అంశాల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారనే ప్రచారం జరుగుతున్నది. ప్రజల సమస్యలను ఎండగట్టడంలో మాజీ మంత్రులు సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోయారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయితున్నాయి.
Follow Us