/rtv/media/media_files/2026/06/14/break-fast-2026-06-14-09-50-04.jpg)
Breakfast in Government Schools and Junior Colleges
Breakfast : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'బ్రేక్‌ఫాస్ట్' (ఉదయపు అల్పాహారం) పథకానికి శ్రీకారం చుట్టింది. కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైన ఈ పథకాన్ని రేపటి (జూన్ 15) నుంచి తొలి విడత కింద ఎనిమిది జిల్లాల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో మొత్తం 1,302 విద్యాసంస్థలను ఎంపిక చేయగా, అందులో 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు వేడివేడి, రుచికరమైన ఉదయపు అల్పాహారం అందనుంది.
ఈ బృహత్తర పథకం నిర్వహణ కోసం ప్రభుత్వం అత్యంత ఆధునికమైన కేంద్రీకృత వంటశాలల (సెంట్రలైజ్డ్ కిచెన్లు) నిర్మాణాన్ని చేపడుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 39 చోట్ల ఈ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.299.90 కోట్ల భారీ బడ్జెట్‌ను అంచనా వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న 7 కిచెన్లను అత్యాధునికంగా ఉన్నతీకరిస్తుండగా, మిగిలిన వాటిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ కిచెన్ల నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం తన వాటాగా 70 శాతం నిధులను భరిస్తుండగా, మిగిలిన 30 శాతం మొత్తాన్ని భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తున్నాయి. తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలికాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ టెండర్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
ఈ పథకం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం వార్షికంగా రూ.720 కోట్లను కేటాయించింది. ఈ నిధులలో అల్పాహారానికి రూ.540 కోట్లు ఖర్చు చేయనుండగా, విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం అందించే పాల కొరకు రూ.180 కోట్లను వినియోగిస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల అల్పాహార అవసరాల కోసమే ప్రభుత్వం రూ.56 కోట్ల నిధులను కేటాయించడం గమనార్హం.
మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన ఎనిమిది జిల్లాల్లో హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లకు ప్రభుత్వం ఈ పంపిణీ బాధ్యతలను అప్పగించింది. హరే కృష్ణ మూమెంట్ సంస్థ వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని 1,162 పాఠశాలలు, 21 జూనియర్ కళాశాలలకు చెందిన 1,14,184 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తుంది. అలాగే మన్నా ట్రస్ట్ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 107 పాఠశాలలు, 12 కళాశాలలకు చెందిన 30,426 మంది విద్యార్థుల ఆకలి తీర్చనుంది.
విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అల్పాహారంతో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావను అందించనున్నారు. ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి చదివే చిన్న పిల్లలకు 75 మి.లీ., ఆపై తరగతుల విద్యార్థులకు 100 మి.లీ. చొప్పున పాలు పంపిణీ చేస్తారు. అల్పాహారంలో భాగంగా సోమవారం దోసె, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ-కూర, గురువారం బోండా, శుక్రవారం ఇడ్లీ, శనివారం ఉప్మా అందించేలా ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం మెనూ ఖరారు చేసింది. చిన్న పిల్లలకు 150 గ్రాములు, 6 నుంచి 12వ తరగతి వారికి 200 గ్రాముల చొప్పున ఉప్మాను వడ్డించనున్నారు.
జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం!
ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ప్రతిష్టాత్మక 'మధ్యాహ్న భోజన పథకాన్ని' ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సైతం విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అల్పాహారంతో పాటే రేపటి నుండి తొలి విడతగా 33 ప్రభుత్వ కాలేజీల్లో ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ కళాశాలల్లోని దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులకు రానున్న రోజుల్లో ఎంతో మేలు చేకూరనుంది.
Follow Us