/rtv/media/media_files/2025/03/21/tYN52rKFQ0oZtKQGA9Kc.jpg)
uppal ipl 2025
Big breaking : ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందే బ్లాక్ టికెట్ల దందా జోరందుకుంది. ఈ మ్యాచ్‌కు నగరంలో భారీ క్రేజ్, డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో.. టికెట్లను అక్రమంగా మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్న ఈ అక్రమ దందా పై పోలీసులు నిఘా పెట్టారు.
ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ‘సోల్డ్ అవుట్’ (Sold Out) అని బోర్డులు పెట్టడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జొమాటో (Zomato), డిస్ట్రిక్ యాప్స్ (District App) ద్వారా జరిగిన అధికారిక టికెట్ బుకింగ్స్‌పై పబ్లిక్‌లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ముఠాలు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం భారీ సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేసి, వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లించారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లను సామాజిక మాధ్యమాల్లో, స్టేడియం వెలుపల పలువురు ఎక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో, నిజమైన క్రీడాభిమానులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ టికెట్ల అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి పోలీసులు.. 10 కేసులు నమోదు!
ఉప్పల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై మల్కాజ్‌గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేడియం పరిసరాల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అక్రమంగా టికెట్లు విక్రయిస్తున్న వారిపై ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు, సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగాంతర నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎవరైనా టికెట్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా సోషల్ మీడియా వేదికగా అధిక ధరలకు ఆఫర్ చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి ఐపీఎల్ (IPL) సీజన్‌లోనూ ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు ఈ బ్లాక్ టికెట్ల సమస్య తలెత్తుతున్నప్పటికీ.. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ దందా మరీ మితిమీరిపోయిందని అభిమానులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరూ అక్రమ మార్గాల్లో విక్రయించే బ్లాక్ టికెట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని, బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించవద్దని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Follow Us