MMTS : రేవంత్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌...MMTS ఉచిత ప్రయాణానికి బ్రేక్.. రైల్వే బోర్డు కీలక షరతులు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం MMTS రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. అయితే ఎంఎంటీఎస్ సేవలు భారీ నష్టాలతో నడుస్తున్నందున ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డు తేల్చి చెప్పింది.

New Update
CM-ABOUT-MMTS

Break for MMTS free travel

MMTS : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకైన ప్రయాణ సాధనంగా ఉన్న మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని రేవంత్ సర్కార్ భావించింది. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ (రాష్ట్ర అవతరణ దినోత్సవం) నుంచి అమలు చేయాలనే ఆలోచనతో, ప్రయాణికుల టికెట్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంటూ ఒక ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని, ప్రతిపాదనను రైల్వే బోర్డు పరిశీలన కోసం పంపింది.

అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రైల్వే బోర్డు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు భారీ నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఈ ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ రైల్వే బోర్డు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఒకవేళ ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తే.. దానికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉండాలని, ఉచిత ప్రయాణం వల్ల వచ్చే నష్టాల మొత్తాన్ని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే అంగీకరిస్తామని రైల్వే అధికారులు తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా ఎంఎంటీఎస్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని రైల్వే అధికారులు లెక్కలతో సహా లేఖలో వివరించారు. ఎంఎంటీఎస్ సర్వీసుల నిర్వహణ ఇప్పటికే రైల్వేలకు భారీ భారంగా మారిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో దీని నిర్వహణకు రూ.179 కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రయాణికుల నుండి వచ్చిన ఆదాయం కేవలం రూ.16.81 కోట్లేనని వెల్లడించారు. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.160 కోట్ల నుండి రూ.162 కోట్లకు పైగా వార్షిక నష్టం వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు అభిప్రాయపడింది.

నష్టాల అంశంతో పాటు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పాత పెండింగ్ బకాయిల అంశాన్ని కూడా రైల్వే బోర్డు లేఖలో ప్రస్తావించింది. ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇంకా సుమారు ₹460 నుండి ₹490 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి ఆర్థిక హామీలతో పాటు, ముందుగా ఈ పెండింగ్ బకాయిలను చెల్లించాలని, అప్పుడే ఉచిత ప్రయాణ పథకాన్ని పరిశీలిస్తామని రైల్వే బోర్డు కఠినమైన షరతు విధించింది.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణ ప్రతిపాదన కోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి రూ. 10 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చినప్పటికీ, రైల్వే బోర్డు విధించిన అదనపు నష్టపరిహార షరతుల వల్ల ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి నిలిచిపోయింది. రైల్వే బోర్డు నుంచి వచ్చిన ఈ సమాచారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయి ఆర్థిక భరోసా, పాత బకాయిల చెల్లింపులపై స్పష్టత వస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందడుగు పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి కార్యాచరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు సంబంధించిన పలు కీలక రైల్వే, మెట్రో విస్తరణ ప్రాజెక్టులతో పాటు ఈ ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదన అంశాన్ని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రితో జరగబోయే ఈ కీలక సమావేశం అనంతరం హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ పథకం భవిష్యత్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు