/rtv/media/media_files/2026/03/31/chicken-shops-close-2026-03-31-21-33-21.jpg)
Chicken shops close
Chicken shops close : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల నిరవధిక బంద్ జరగనుంది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న మార్జిన్ తగ్గింపుపై తీవ్ర ఆగ్రహంతో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు తమ లాభాల కోసం వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని అసోసియేషన్ మండిపడింది. గత 20 ఏళ్లుగా పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ వ్యాపారులకు కేజీకి రూ. 26 మార్జిన్ ఇచ్చేవి. అయితే, ఇటీవల ఈ మార్జిన్‌ను ఏకంగా రూ. 16కు తగ్గించడంపై వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, పనివారి జీతాల దృష్ట్యా ఈ తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేయడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేజీకి రూ. 30 మార్జిన్ ఇస్తే తప్ప షాపులు తెరిచే ప్రసక్తే లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. పౌల్ట్రీ కంపెనీలు కోట్లాది రూపాయలు లాభపడుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఎండలో నిలబడి విక్రయాలు చేసే చిన్న వ్యాపారులకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చికెన్ షాపుల నిరవధిక బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వేసవి కాలం కావడంతో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో బంద్ ప్రారంభం కావడంతో చికెన్ ప్రియులు, హోటల్ నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఆదివారాలు, శుభకార్యాల సమయంలో చికెన్ దొరక్కపోవడం ఇబ్బందిగా మారనుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్ వంటకాలు మెనూ నుంచి మాయమయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సమన్వయం కుదిర్చి సమస్యను పరిష్కరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని వ్యాపార సంఘాలు భీష్మించుకోవడంతో ఈ పోరు ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.
Follow Us