గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో మేయర్‌గా ఎన్నికైన ఆమె బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ సమావేశాలు జరిగిన ప్రతిసారి సభ్యులపై నోరుజారడంతో అనేకసార్లు వివాదంలో చిక్కుకున్నారు. కాగా మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌పై బీఆర్‌ఎస్ అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. అయితే తాజాగా విజయలక్ష్మికి మరో షాక్ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై బుధవారం హైకోర్టులో పిల్ దాఖలైంది.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
Gadwal Vijayalakshmi - Greater Hyderabad
బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌లో ఉన్న కోట్ల విలువ చేసే భూములను.. జీవో నెం.56 ద్వారా విజయలక్ష్మి తండ్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ రఘువీరా రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో కేశవరావు కూతురు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవిత, రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా గత ప్రభుత్వం వారి కుటుంబానికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ విచారణ చేపట్టారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరపున న్యాయవాదులు కొంత గడువు కోరడంతో తదుపరి విచారణ వచ్చే నెల 27 కు వాయిదా పడింది.
Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన
ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి, ఆమె తండ్రి కేశవరావులు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ పనిచేశారు. కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ ప్రధానకార్యదర్శిగా పనిచేయగా, విజయలక్ష్మి మేయర్‌గా పనిచేశారు. దాంతో నాటి ప్రభుత్వంతో ఉన్న అనుబంధంతో సదరు భూములకు సంబంధించి ప్రభుత్వంతో జీవో జారీ చేయించుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పుతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం ఆ భూములను ఎలాగైన వారికి దక్కకుండా చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ప్రజావ్యాజ్యం వేశారంటున్నారు.
Also Read : ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మేయర్ విజయలక్ష్మి మొదటినుంచి కూడా వివాదాల చుట్టే తిరుగుతున్నారు. తాజాగా ఆమెపై అవిశ్వాసం పెట్టే దిశగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఈ విషయమై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు కూడా. త్వరలోనే గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవానికి వారం క్రితమే ఈ సమావేశం జరగాల్సి ఉండగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోదరి అకాలమరణంతో సమావేశం వాయిదా పడింది. త్వరలోనే తిరిగి సమావేశమై అవిశ్వాసంపై బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అవిశ్వాసం నెగ్గుతుందా లేదా అన్న విషయం పక్కనపెడితే విజయలక్ష్మి పై అవిశ్వాసం పెట్టి తీరాల్సిందే అన్న నిర్ఱయంతో బీఆర్ఎస్ ఉంది. అయితే ఎంఐఏం అవిశ్వాసానికి మద్ధతు తెలిపితే కొంతవరకు విజయలక్ష్మికి ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ భూమి వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంటే త్వరలోనే తేలనుంది.