Supreme Court: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్‌ వర్తింపజేయాల్సిందేనా ?

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సమర్థించిన ఆరుగురిలో నలుగురు న్యాయమూర్తులు.. ఎస్సీలకు క్రీమీలేయర్ మినహాయింపును తప్పనిసరిగా చేయాలన్నారు.

New Update
Supreme Court: సుప్రీం కోర్టులో ఆర్జీకర్‌ హత్యాచార కేసు విచారణ!

Sub-classification of SC & ST: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో వెనకబడి ఉన్న వారి కోసం ప్రత్యేక కోటా ఇచ్చేందుకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఈవీ చిన్నయ్య (EV Chinnaiah) నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరస్కరించింది. 6:1 మెజారిటీతో చీఫ్‌ జస్టీస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ తీర్పు వెలువరించింది.

తాజా తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచనలు చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి క్రీమీ లేయర్ (Creamy Layer) వర్గాలను మినహాయించాల్సిన అవసరం ఉందని జస్టీస్ గవాయి పేర్కొన్నారు. ఉప వర్గీకరణను సమర్థించిన ఆరుగురిలో నలుగురు న్యాయమూర్తులు.. ఎస్సీలకు క్రీమీ లేయర్‌ విధానాన్ని తప్పనిసరిగా చేయాలని తమ తీర్పులలో స్పష్టం చేశారు.

క్రీమీ లేయర్‌ అంటే
క్రీమీ లేయర్‌ అంటే ఒక కులంలో సంపన్న కుటుంబాలను క్రిమీ లేయర్‌గా భావిస్తారు. ప్రస్తుతం ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు ఈ క్రీమీ లేయర్‌ను అమలు చేస్తున్నారు. అంటే ఓబీసీ వర్గాల్లో ఏడాదికి రూ.8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్లు వర్తించవు. దీంతో ఈ వర్గాలను జనరల్‌ కేటగిరీ మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. వీళ్లలో కూడా ఈ క్రీమీ లేయర్‌ వర్గాలను మినహాయించాల్సి అవసరం ఉందని నలుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించి.. వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించే విధానాన్ని రూపొందిచాలని జస్టీస్‌ బీఆర్ గవాయి తన తీర్పులో వెల్లడించారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు నిజమైన సమానత్వాన్ని సాధించేందుకు ఇదే ఏకైక మార్గమని పేర్కొన్నారు. రిజర్వేషన్‌ ప్రయోజనం పొందిన ఎస్సీ వర్గానికి చెందిన పిల్లలు.. రిజర్వేషన్ పొందని వ్యక్తి పిల్లలతో సమాన పీఠంపై ఉంచలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓబీసీలకు వర్తించే క్రీమీలేయర్ విధానం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఉప వర్గీకరణపై జస్టీస్‌ చంద్రచూడ్‌ ఏమన్నారంటే
' వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష వల్ల ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించదు. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తిరస్కరిస్తున్నాం. రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉప వర్గీకరణ చేసేందుకు పర్మిషన్ ఇస్తున్నామని ' డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం తెలిపింది. ఈ కేటగిరిలో ఇంకా వెనకబడిన వారికి మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ తీర్పుకు ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఎస్సీ, ఎస్టీ కేటగిరీల ఉప వర్గీకరణను వ్యతిరేకించారు.

వివాదంలో ఉప వర్గీకరణ

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50 శాతం వాల్మీకి, మజహబీ సిక్కులకు కేటాయిస్తూ 2006లో పంజాబ్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదని 2010లో పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది. 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును పంజాబ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఉల్లంఘిస్తుందని హైకోర్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా ఆ అధికారం పార్లమెంటు మాత్రమే ఉంటుందని.. రాష్ట్రా ప్రభుత్వాలకు ఉండదని తెలిపింది. ఈ మేరకు ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును సమర్థించింది.

ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత దీనిపై మరో 22 పిటిషన్లు కూడా దాఖయ్యాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కూడా ఇందులో వ్యాజ్యదారుడిగా ఉన్నారు. వీటిపై విచారణ జరిపిన అయిదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అనంతరం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విచారణ జరిపి.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గురువారం సంచలన తీర్పును వెలువరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణకు మద్దతు తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు