/rtv/media/media_files/2025/03/05/4WVlEhywZ8IftbE3UgZt.jpg)
Virat Kohli
కింగ్ అన్న పేరు మామూలుగా రాలేదు. చాలాసార్లు సరిగ్గా ఆడకపోవచ్చును. కానీ సరైన టైమ్ లో జట్టుకు అండగా ఎప్పుడూ ఉంటాడు. విరాట్ జట్టులో ఉన్నాడు అంటే ఒక ధైర్యం. ఆడినా ఆడకపోయినా ప్రత్యర్థుల గుండెల్లే గుబులు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మధ్య కాలంలో ఇతనిని అందరూ తిట్టేవాళ్ళే. ఇన్నాళ్ళు ఆడిన ఆట అంతా మర్చిపోయారు. గత కొన్నాళ్ళుగా ఆడటం లేదని విమర్శలు చేశారు. ఇంక రిటైర్ అయి పొమ్మని ఉచిత సలహాలు కూడా ఇచ్చేశారు. అలాంటి టైమ్ లో గురి చూసుకుని కొట్టాడు కోహ్లీ. తనను విమర్శిస్తున్న వాళ్ళ నోళ్ళు మూయించాడు. రెండు మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించి తానమేంటో నిరూపించాడు. ఒకటి పాకిస్తాన్ మీద, మరొకటి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా మీద. రెండు మ్యాచ్ లు భారత జట్టుకు చాలా ముఖ్యమైనవి. రెండిటిలోనూ నిలకడగా ఆడి సీనియర్ గా తాను జట్టుకు ఎంత అవసరమో చూపించాడు. ఎక్కడ తగ్గాలో కాదు...ఎక్కడ నెగ్గాలో చేసి చూపించాడు విరాట్ కోహ్లీ.
మైల్ స్టోన్ నాకెప్పుడూ ముఖ్యం కాదు...
విరాట్ జట్టులోకి వచ్చిన మొదట్లో చాలా అగ్రెషన్ గా ఉండేవాడు. సయ్ అంటే సయ్ అని దూసుకువెళ్ళిపోయేవాడు. కానీ అనుభవం పెరుగుతున్న కొద్దీ స్థితప్రజ్ఞతను సాధించుకున్నాడు. జట్టుకు తానెంత అవసరమో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఆడాడు, ఆడుతున్నాడు కూడా. ఆ పరంపర్లో ఎన్నో మైల్ స్టోన్స్ ను దాటాడు. రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అయినా ఎంత ఎత్తు ఎదిగినా గర్వం లేకుండా ఒదిగే ఉన్నాడు కోహ్లీ. తన వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం కోసం ఆడడమే ముఖ్యమనే భావనతోనే ఉన్నాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల దగ్గర అవుట్ అయిపోయిన విరాట్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. జట్టు విజయానికి కారణమైనా...వ్యక్తిగత రికార్డుకు దూరమయ్యాడు. మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటున్న సమయంలో కామెంటేటర్ విరాట్ ను ఇదే అడిగాడు. దానికి నేనెప్పుడూ మైలు రాళ్ళమీద దృష్టి పెట్టను. వాటిని పట్టించుకోకపోతే అవి జరుగుతాయి. తాను సెంచరీ చేసుంటే బాగుండేది కానీ..జట్టు విజయం అంత కంటే ముఖ్యం అని సమాధానం చెప్పి కింగ్ కోహ్లీ అని మరోసారి అనిపించుకున్నాడు. వన్డేల్లో వయసు పెరిగే కొద్దీ మెరుగవుతున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నాకు తెలియదు.. అది మీరే చెప్పాలి’ అని విరాట్ చెప్పా డు.
నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ రికార్డులు...
నిన్న ఆస్ట్రేలియా మీద చేసిన 84 పరుగులతో విరాట్ కోహ్లీ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధికంగా 24 సార్లు 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ 23 సార్లుతో పేరు మీద ఉంది. సచిన్ 58 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. కోహ్లీ కేవలం 53 ఇన్నింగ్స్‌ల్లోనే దీనిని సాధించాడు.
ఆసీస్‌పై 84 పరుగులు చేసిన కోహ్లీ మరో ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీలు మొత్తం అన్నింటిలో కలిపి 1000 పరుగులు చేసిన తొలి క్రికెట్ర్ గా అరుదైన రికార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1,023 రన్స్ ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో 746 అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు. అంతకు ముందు ఇది శిఖర్ ధావన్ 701 పరుగులతో పేరు మీద ఉంది. ఓవరాల్‌గా రెండో స్థానంలో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ (791) అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ఛేదనలో సచిన్ టెండూల్కర్ తర్వాత 8,000 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు.