/rtv/media/media_files/2025/01/25/z3OmkNmX7nBnqC2Xvr0W.jpg)
England Vs India Second T20 Match
పొట్ట ఫార్మాట్ లో మన వాళ్ళకు తిరుగులేదు. అందులో భారత్ పిచ్ ల మీద అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. ఈరోజు చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆ జట్టను చిత్తు చేసింది. రెండు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో టార్గెట్ ను చేరుకుంది. తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 26 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్సే 3, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, జేమీ ఓవర్టన్, లియామ్ లివింగ్‌స్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు బంతుల్లోనే బ్యాటర్లు ఆరు పరుగులు సాధించడంతో మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..
అంతకు ముందు టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మొదట నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చారు. మొదటి ఓవర్లోనే అర్షదీప్ సాల్ట్ ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 8 పరుగులకు ఒక వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కాస్త పట్టుదలగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 20 ఓవర్లలో 165 పరుగులు చేశారు. జోస్ బట్లర్ (45) రాణించగా.. బ్రైడన్ కార్సే (31), జేమీ స్మిత్ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్య, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.