/rtv/media/media_files/2025/03/04/JwekcykGDAzcAejxoykO.jpg)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. మీకు నాజూగ్గా ఉండేవాళ్లు కావాలంటే మోడలింగ్‌కు వెళ్లాలంటూ కామెంట్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా అధిక బరువుతో ఉన్నాడని చాలా కాలంగా విమర్శించబడ్డాడు. కానీ అతను ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియాతరపున 150 పరుగులు చేసి, ఆపై రెండు, మూడు సార్లు యాభై కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అప్పుడు బరువుతో సమస్య ఏమిటి అని సన్నీ ప్రశ్నించాడు.
శరీర పరిమాణానికి క్రికెట్ తో ఎలాంటి సంబంధం లేదని తాను అనుకుంటున్నానని సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఆడగలమా లేదా అనేది మన మానసిక బలం పైన ఆధారపడి ఉంటుందన్నాడు. మరోవైపు రోహిత్ శర్మపైబాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలన్నాడు భజ్జి. రోహిత్ అద్భుతమైన ఆటగాడని, గొప్ప కెప్టెన్ అని కొనియాడారు.
అసలేం జరిగిందంటే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ.. రోహిత్ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని షామా మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేని ఆమె చెప్పుకోచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
షామా మహమ్మద్ కామెంట్స్ పై బీసీసీఐ కూడా ఘాటుగానే స్పందించింది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లి కీలకమైన దశలో ఉన్న జట్టుపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైనది కాదని సూచించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.