West Bengal : పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన హింస..పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు, ధ్వంసం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పలు చోట్ల రాజకీయ హింస చెలరేగింది. రాష్ట్రంలోని పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు నిప్పుపెట్టారు.

New Update
FotoJet - 2026-05-06T071632.123

Violence breaks out in West Bengal.. Attacks and destruction of TMC offices

West Bengal : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.  ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో, దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరిణామంతో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓటమి భయంతో టీఎంసీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ మిడ్నాపూర్, ఖరగ్‌పూర్ వంటి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడగా, పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాల సరళి వెలువడిన వెంటనే రాష్ట్రంలోని పలు చోట్ల రాజకీయ హింస చెలరేగింది. కోల్‌కతాలోని టోలీగంజ్, కస్బా, బారానగర్, హౌరా వంటి కీలక ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా టోలీగంజ్‌లో మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయగా, రూబీ క్రాసింగ్ వద్ద కౌన్సిలర్ సుశాంత ఘోష్ కార్యాలయంపై బీజేపీ జెండాలతో వచ్చిన అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. జమురియాలోని రతీ బాతీ ప్రాంతంలో ఏకంగా పార్టీ కార్యాలయానికే నిప్పు పెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జిల్లాల్లోనూ ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. అసన్‌సోల్, బరాబాని, బారీపూర్‌, తుఫాన్‌గంజ్ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసి రోడ్లపై పడేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల ఫోటోలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారు, ఇప్పుడు ఎదురుదాడులు జరుగుతుండటంతో భయం గుప్పిట్లో గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ విధ్వంసకాండపై పోలీసులు నిఘా పెంచి, ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఈ హింసాత్మక ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అధికారం చేజిక్కించుకోగానే బీజేపీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని, రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమే ఆ పార్టీ నైజమని సామాజిక మాధ్యమం 'X' వేదికగా మండిపడింది. ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫలితాల తర్వాత కార్యకర్తలు సంయమనం పాటించాలని తమ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించింది.

ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్‌లో ఒకవైపు గెలుపు ఉత్సాహం, మరోవైపు ఓటమి నైరాశ్యంతో కూడిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అల్లర్లు పూర్తిగా అదుపులోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఈ స్థాయిలో హింస చెలరేగడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పరిణామాలు మరెన్ని మలుపులు తిరుగుతాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు