/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)
TVK Vijay
TN Election Results: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అధికారం చేపట్టబోతోందా? అంటే.. మాజీ ఐపీఎస్ అధికారి రవి నిర్వహించిన తాజా 'పోస్ట్-ఎగ్జిట్ పోల్' సర్వే ఫలితాలు "అవును" అనే సమాధానం ఇస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ఓటర్ల నాడిని విశ్లేషిస్తూ వెలువడిన ఈ సర్వే వివరాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
సాధారణ సర్వే సంస్థలకు భిన్నంగా, మాజీ ఐపీఎస్ అధికారి రవి ఈ సర్వేను అత్యంత శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో, ఒక్కో నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున మొత్తం 2,340 మంది మాజీ పోలీసు అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని 100 మంది ఓటర్లను కలిసి అభిప్రాయ సేకరణ చేశారు. ఇలా మొత్తం 2.34 లక్షల మంది ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. సేకరించిన భారీ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో విశ్లేషించి కచ్చితమైన అంచనాలను రూపొందించారు.ఈ సర్వే ఫలితాల ప్రకారం, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం అనూహ్య విజయాన్ని నమోదు చేయబోతోంది.
మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీTVK ఒంటరిగా 121 సీట్లు గెలుచుకుని, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రవి పేర్కొన్నారు.ఈ పార్టీకి ఏకంగా 41% ఓట్ల వాటా లభించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. యువత, మైనారిటీలు, మత్స్యకార వర్గాలు విజయ్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా 1.50 కోట్ల కుటుంబాల్లో కనీసం ఒక ఓటు విజయ్‌కు పడిందని అంచనా.దశాబ్దాలుగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK)ల మధ్యే సాగుతున్న తమిళ రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.సాంప్రదాయకంగా పాత పార్టీలకు ఓటు వేసే వృద్ధులు సైతం, తమ పిల్లలు, మనవళ్ల కోరిక మేరకు ఈసారి విజయ్‌కు ఓటు వేశామని సర్వేలో వెల్లడించారు.
కొంగు జోన్‌లో డీఎంకే, ఏఐఏడీఎంకేలతో TVK హోరాహోరీగా తలపడుతుండగా, చెన్నై ప్రాంతంలో TVK స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. దక్షిణ జిల్లాల్లో కూడా అన్ని పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, అన్ని సర్వేలు ఒకే రకమైన ఫలితాలను చూపడం లేదు. ఇతర ప్రముఖ సంస్థల అంచనాలు వేరుగా ఉన్నాయి. యాక్సిస్ మై పోల్: డీఎంకేకు 92-110 సీట్లు, ఏఐఏడీఎంకేకు 22-32 సీట్లు రాగా, TVK (సర్వేలో TNAగా పేర్కొన్నారు)కు 98-132 సీట్లు రావచ్చని అంచనా వేసింది.జీ న్యూస్ (జీనియా ఏఐ): ఈ సర్వే మాత్రం అధికార డీఎంకేకే మొగ్గు చూపింది. డీఎంకేకు 140-162 సీట్లు, ఏఐఏడీఎంకేకు 52-74 సీట్లు, TVKకు కేవలం 8-18 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఫిబ్రవరి 2024లో పార్టీని ప్రకటించిన విజయ్, అతి తక్కువ కాలంలోనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో 233 నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులు 'విజిల్' గుర్తుతో పోటీ చేశారు. సేలం ఎడప్పాడి నియోజకవర్గంలో సాంకేతిక కారణాలతో నామినేషన్ రద్దు కావడంతో, అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మొత్తానికి, ఐపీఎస్ రవి సర్వే ఫలితాలు నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైనట్లే. అయితే, సర్వేలు ఎప్పుడూ 100% కచ్చితంగా ఉండవని, ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని రవి స్వయంగా పేర్కొనడం గమనార్హం.
అయితే తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ అధికారం చేపట్టకపోయినప్పటికీ ఓట్లు మాత్రం చీల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ చీలిక ఓట్లు ఏ పార్టీకి నష్టం చేస్తాయి అనేది తాజాగా చర్చనీయంశంగా మారింది. చీలిక ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీస్తాయా అనే విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
గతంలో కేవలం డీఎంకే, ఎఐడీఎంకే పార్టీల మధ్యనే ఉండే పోటీ ఈసారి టీవీకే ఎంట్రీతో ముక్కోణపు సమరంగా మారింది. ఈ పోటీలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. దీంతో ప్రధాన పార్టీలలో టెన్షన్ మొదలైంది. మరోవైపు పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని అంచనా వేసినప్పటికీ, యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. తాజాగా పోస్ట్-ఎగ్జిట్ పోల్ కూడా విజయ్ దే విజయంగా పేర్కొనడంతో తమిళనాట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే టీవీకే కు తగిన సీట్లు రాకపోయిన రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో మాత్రం విజయ్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Follow Us