/rtv/media/media_files/2026/05/11/vb-g-ram-g-act-to-come-into-force-from-july-1-2026-05-11-18-28-06.jpg)
VB-G RAM G Act to come into force from July 1
VB-G RAM G Act: దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-G RAM G Act) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త చట్టం ద్వారా ఉపాధి రోజులను గతంలో ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచడం, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక పరివర్తన తీసుకురావడమే టార్గెట్‌గా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని రూపొందించింది.
Also Read: ఏంటీ ఈ పోక్సో చట్టం? : అరెస్ట్ తప్పదు.. బెయిల్ దొరకదు.. శిక్ష ఏంటో తెలుసా?
పాత పద్ధతి నుంచి కొత్త విధానంలోకి మారే సమయంలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా వచ్చే గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు అందరికీ వచ్చేదాక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-కేవైసీ పూర్తి చేసిన పాత ఉపాధి హామీ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది. ఒకవేళ ఇప్పటిదాకా ఎలాంటి జాబ్ కార్డులు లేని కొత్త కార్మికులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లు తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచనలు చేసింది. పారదర్శకతను పెంచుకునేందుకు వీలుగా ఈ కొత్త విధానంలో వేతన సవరణలు, బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ పర్యవేక్షణ లాంటి కీలక మార్పులు రానున్నాయి.
Also Read: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్!
కొత్త చట్టం కింద వేతనాల చెల్లించడం, పని దినాల కేటాయించడం, పరిపాలనా పరమైన ఖర్చులు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం లాంటి అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చలు జరుపుతోంది. ఈ నియమ నిబంధనలకు సంబంధించి తుది ముసాయిదాను త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ కొత్త వ్యవస్థలో లబ్ధిదారులకు అందాల్సిన వేతన నిధులను ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోకే జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
Follow Us