/rtv/media/media_files/2026/05/06/tvk-vijay-2026-05-06-18-45-45.jpg)
TVK Vijay
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ 108 స్థానాల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకానున్నప్పటికీ సీఎంగా విజయ్‌కు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆయన ప్రకటించిన ఎన్నికల హామీల అమలుపై చర్చ మొదలైంది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా టీవీకే ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వంపై ఏటా రూ.లక్ష కోట్ల అదనపు భారం పడనుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మహిళలకు అందించే నెలవారీ సాయాన్ని రూ.1000 నుంచి రూ.2,500 పెంచడం వల్ల అదనంగా రూ.21,618 కోట్లు, వృద్ధాప్య పింఛన్ల పెంపు వల్ల కూడా వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉండగా.. కొత్త పథకాలు అమలు చేసేందుకు టీవీకేకు సవాలుగా మారనుంది. విజయ్ ప్రకటించిన హామీల్లో ఫ్రీ విద్యుత్ కోటా పెంపు, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, రైతులకు వార్షిక పెట్టుబడి సాయం లాంటివి ఉన్నాయి. ఇవి మధ్యతరగతి, పేద వర్గాలకు ఊరటనిచ్చేవే అయినప్పటికీ నిధుల సమీకరంచడమే ప్రధాన సమస్యగా మారనుంది.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్‌కు గుడ్‌న్యూస్
నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000, ఇంటర్న్‌షిప్ చేసేవాళ్లకి నెలకు రూ.5000-8000 స్టయిపెండ్, నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం లాంటి హామీలు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచనున్నాయి. అలాగే చేపల వేట నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులకు నెలకు రూ.27,000 భృతి కల్పిస్తామన్నారు. ఈ వినూత్న హామీలన్నీ కూడా దేశంలోనే అత్యధిక వ్యయం అయ్యే పథకాలుగా నిలవనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే పాత పింఛన్ విధానం (OPS) అమలును పరిశీలించడం, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లాంటివి ప్రభుత్వ వేతనాలు, పింఛన్ల బిల్లును భారీగా పెంచనున్నాయి. అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు లాంటి అంశాలు కూడా నిధుల కేటాయింపునకు సవాలుగా మారనున్నాయి. ఇప్పటికే తమిళనాడులో సుమారు రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు బడ్జెట్ ఉంది. దీంతో టీవీకే ఇచ్చిన హామీలు అమలు చేయడం తమిళనాడుకు కత్తిమీద సాము లాంటిదేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఆర్థిక సవాళ్ల మధ్య విజయ్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఆదాయ వనరులను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన రూ.లక్ష కోట్లను ఎలా సమకూరుస్తారు? రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించుకుంటూనే ప్రజలకిచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు? అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఓ గత ప్రభుత్వ పథకాల కొనసాగింపు, మరోవైపు తన సొంత పథకాలను అమలు చేసేందుకు విజయ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు, చర్యలు చేపడుతుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: త్రిషకు విజయ్ బిగ్‌షాక్..తిరుచ్చి ఈస్ట్ నుంచి నో టికెట్!
Follow Us