ASHA BHOMSLE : భారతీయ సంగీత శిఖరం.. ఆశా భోంస్లే

కొన్ని గొంతులు గాలిలో కలిసిపోతాయి. కానీ కొన్ని గొంతులు గాలికే సంగీతాన్ని నేర్పుతాయి. దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండె చప్పుళ్లను తన స్వరంతో శాసించిన ఆ మాయావి.. ఆ గాన కోకిల ఆశా భోంస్లే ఇక లేరు. ఇక నుంచి రికార్డింగ్ స్టూడియోలో ఆ చిలిపినవ్వు ఇక కనిపించదు. 

New Update
FotoJet (50)

ASHA BHOMSLE

ASHA BHOMSLE :  కొన్ని గొంతులు గాలిలో కలిసిపోతాయి.. కానీ కొన్ని గొంతులు గాలికే సంగీతాన్ని నేర్పుతాయి. దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండె చప్పుళ్లను తన స్వరంతో శాసించిన ఆ మాయావి.. ఆ గాన కోకిల ఆశా భోంస్లే ఇక లేరు.  ఆమె పాడితే విరహం పలకరించేది.. ఆమె పాడితే సంతోషం చిందులేసేది. ఆమె పాడితే బాధ కూడా తీయగా అనిపించేది. ఇక నుంచి రికార్డింగ్ స్టూడియోలో ఆ చిలిపి నవ్వు ఇక కనిపించదు. 

ఒక శకం ముగిసింది.. ఒక అద్భుత స్వరం మూగబోయింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఇండియన్ ప్లే బ్యాక్‌ సింగర్ ఆశాభోంస్లే కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సినీ అభిమానుల షాక్‌కు గురయ్యారు.
 
 ఆశా భోంస్లే.. కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. భారతీయ సినిమా ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రోజు ఆమె మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె పాడిన వేల పాటలు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవమే.
 
1933 సెప్టెంబర్ 8న ఒక సంగీత కుటుంబంలో జన్మించిన ఆశా భోంస్లే అసలు పేరు ఆశా మంగేష్కర్. అయితే ఆశా జీవితం పూల బాట కాదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణం తర్వాత, అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత ఆమె భుజాన పడింది. తన అక్క లతా మంగేష్కర్ నీడలో ఉంటూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. తొలినాళ్లలో కేవలం చిన్న చిన్న పాటలు, ఎవరూ పాడనటువంటి కష్టమైన ట్యూన్స్ మాత్రమే ఆమెకు ఇచ్చేవారు. కానీ, అపజయమే ఆమెకు గెలుపు నేర్పింది.
 
ఆశా భోంస్లే గొంతులో ఏదో మాయ ఉంది. మెలోడీ పాటలైనా, హుషారైన క్లబ్ సాంగ్స్ అయినా, భక్తి గీతాలైనా, గజల్స్ అయినా.. ఆమె పాడితే ఆ పాటకి ప్రాణం వచ్చేది. ఓ.పి. నయ్యర్, ఆర్.డి. బర్మన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన ప్రయోగాలు భారతీయ సంగీత గమనాన్ని మార్చేశాయి. 'దమ్ మారో దమ్' నుంచి 'ఇన్ ఆంఖోన్ కీ మస్తీ కే' వరకు ఆమె ప్రయాణం అద్వితీయం."
 
హిందీ, తెలుగుతో పాటు చాలా భాషల్లో పాటలకు తన స్వరాన్ని అందించారు. ఆమె సాధించిన విజయాలు లెక్కలేనన్ని. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆమె రికార్డు సృష్టించారు. దాదాపు 20కి పైగా భాషల్లో 11 వేలకు పైగా పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు.
 
భారతీయ సంగీతానికి ఆమె ఎనలేని సేవలందించింది. ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2008లో ఆమెను పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2000లో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. ఆమె ఒక జీవన సాఫల్య పురస్కారం కూడా అందుకుంది.
 
ఆమె జీవితం కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఎన్నో వ్యక్తిగత విషాదాలు ఆమెను వెంటాడాయి. తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని కోల్పోవడం, తన ప్రాణ సమానమైన అక్క లతా మంగేష్కర్ మరణం ఆమెను ఎంతో కుంగదీశాయి. అయినప్పటికీ, ఆ బాధనంతా దిగమింగుకుని, తన పాటతో ప్రపంచాన్ని నవ్వించారు. జీవితం అంటే ముందుకు సాగడమే.. అని ఆమె ఎప్పుడూ చెప్పేవారు.
 
ఆశాభోంస్లే ఎక్కడికీ వెళ్ళలేదు.  ఉదయం మీరు రేడియో ఆన్ చేసినా,  మీ ఫోన్ లో ప్లేలిస్ట్ ప్లే చేసినా.. అదే మధుర స్వరం మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది. కానీ, ఆ గొంతు వెనుక ఉన్న ఆ మమకారం, ఆ నవ్వు ఇక భౌతికంగా మన మధ్య లేవు అన్నదే చేదు నిజం. బహుశా.. అక్కడ స్వర్గంలో తన అక్క లతా దీదీ పిలుపు వినిపించిందేమో.. అందుకే ఈ లోకాన్ని మూగబోయేలా చేసి, ఆకాశంలో ధృవతారగా కలిసిపోయారు.

జోహార్ ఆశా జీ.. మీరు పాడిన ప్రతి పాట మా గుండెల్లో ఒక జ్ఞాపకం. మీ స్వరం ఉన్నంత వరకు మీరు మా మధ్య జీవించే ఉంటారు. భారతీయ సంగీత శిఖరం.. ఆశా భోంస్లేకు RTV ఘన నివాళి.

Advertisment
తాజా కథనాలు