/rtv/media/media_files/2026/05/09/vck-vijay-2026-05-09-13-26-09.jpg)
Tamil politics is reminiscent of a suspense thriller
Tamil Nadu : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై ఆరు రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ (118 స్థానాలు) రాకపోవడంతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇప్పటివరకు ఎవరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. సోమవారం వెలువడిన ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళ రాజకీయాలు ఒక హై-టెన్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.
తొలుత గవర్నర్ పూర్తి మ్యాజిక్ ఫిగర్ (118 స్థానాల) బలనిరూపణ పత్రాలు చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తానని స్పష్టం చేయడంతో విజయ్ ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ (5 సీట్లు), వామపక్షాలు (CPI - 2, CPM - 2) మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 117కు చేరింది. అయితే, రెండు స్థానాలు ఉన్న విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ మొదట మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. దీంతో విజయ్ మేజారిటీ మార్కును అందుకోలేకపోయారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే (VCK) పార్టీ భారీ డిమాండ్లు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ పార్టీకి డిప్యూటీ సీఎం (ఉప ముఖ్యమంత్రి) పదవితో పాటు, ప్రతిష్టాత్మకమైన 'తిరుచ్చి ఈస్ట్' అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించాలని వీసీకే పట్టుబడుతోంది. ఈ డిమాండ్ల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే మద్దతు ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు విజయ్ స్వయంగా వీసీకే అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు.తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ రాజకీయ డ్రామాకు శనివారం సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీసీకే పార్టీ ఈ సాయంత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో విజయ్‌కు మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై తమ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఒకవేళ వీసీకే మద్దతు లేఖ ఇస్తే.. విజయ్ తన బలాన్ని 119 కి చేర్చుకుని సగర్వంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమవుతుంది.
మరోవైపు సస్పెన్స్ తీవ్రస్థాయికి చేరడంతో టీవీకే అధినేత విజయ్ తన నీలాంగరై నివాసం నుంచి పట్టినాపాక్కంలోని తన మరో ఇంటికి చేరుకున్నారు. ఈ ఇల్లు గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ వీసీకే మద్దతు లేఖ చేతికి అందితే.. వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరాలని విజయ్ భావిస్తున్నారు. అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కాసేపట్లోనే కేరళ పర్యటనకు వెళ్లనుండటంతో.. ఆలోపే ఈ మద్దతు లెక్కలు తేలాల్సి ఉంది.
విజయ్ ఫ్యాన్స్ ఆందోళనలు
మరోవైపు తమ ప్రియతమ నాయకుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణాల కోసం వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి చెన్నై నగరానికి భారీగా చేరుకున్న అభిమానులు నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్ద గుమిగూడారు. కొందరు రాజకీయ శక్తులు విజయ్ సీఎం కాకుండా కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్లపై జెండాలతో హంగామా సృష్టిస్తున్నారు. వీసీకే పార్టీ సానుకూల నిర్ణయం తీసుకుని, విజయ్ కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow Us