/rtv/media/media_files/2026/03/24/operation-kagar-2026-03-24-08-23-58.jpg)
దేశంలో కొన్ని దశాబ్దాలుగా అంతర్గత భద్రతకు సవాలుగా మారిన సమస్య మావోయిజమని కేంద్రం భావించింది. ఈ ఉద్యమాన్ని వేళ్లతో సహా పెకిలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' చివరి దశకు చేరుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్‌లైన్ దగ్గరపడింది. 2026 మార్చి 31 నాటికి భారతదేశాన్ని 'నక్సల్స్ రహిత' దేశంగా మార్చుతామని ఆయన సవాల్ విసిరారు. దీని కోసమే ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఈ గడువు ముగియడానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో, బస్తర్ అడవుల్లో భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. ఒకప్పుడు 126 జిల్లాలకు పైగా విస్తరించిన నక్సల్స్ ప్రభావం, ఇప్పుడు కేవలం 3-4 జిల్లాలకే పరిమితమైంది. వారి సంఖ్య కూడా పదులు, వందలకే పరిమితమైంది.
గత రెండేళ్లుగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని అబూజ్‌మాడ్ లాంటి కంచుకోటల్లో భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ లెక్కల ప్రకారం 2024 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో హతమైన మావోయిస్టుల సంఖ్య 530 దాటింది. అంతేకాదు 2,004 మంది మావోలు అరెస్ట్ అయ్యారు. 2,700 మందికి పైగా లోంగిపోయారు.
ముఖ్యమైన ఎన్‌కౌంటర్లు
ఏప్రిల్ 2024 (కాంకేర్): ఒకే ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఇది ఈ ఆపరేషన్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
మే 2025 (కర్రెగుట్టలు కొండలు): తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో 21 రోజుల పాటు జరిగిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు.
మే 2025 (అబుజ్‌మడ్): మావోయిస్టు అగ్రనేత, భారీ రివార్డు ఉన్న నంబాల కేశవరావు (బసవరాజు) సహా 27 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి.
కీలక నేతలు: ఈ రెండేళ్లలో 6 గురు పొలిట్‌బ్యూరో/సెంట్రల్ కమిటీ సభ్యులు, 17 మంది స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఖతమయ్యారు.
మిగిలి ఉన్నది వీరే..
2026 మార్చి నాటికి మావోయిస్ట్ పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. దేశవ్యాప్తంగా సాయుధ కేడర్ సంఖ్య గణనీయంగా పడిపోయింది. భద్రతా సంస్థల తాజా అంచనాల ప్రకారం, దేశం మొత్తం మీద ఇప్పుడు 350 కంటే తక్కువే మావోయిస్ట్ కేడర్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కేంద్రమైన బస్తర్, అబుజ్‌మడ్ ప్రాంతాల్లో కేవలం 100 నుండి 150 మంది సాయుధ సభ్యులు మాత్రమే ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పి. ఇటీవల పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి, డీజీపీ మార్చి 2026లో వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలో ఇప్పుడు కేవలం 13 నుండి 15 మంది మావోయిస్టులు మాత్రమే యాక్టీవ్‌గా ఉన్నారు. తెలంగాణలో సుమారు 17 మంది, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 10 మంది కంటే తక్కువ కేడర్ ఉన్నట్లు ఆయా రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు 40-45 మంది సభ్యులున్న కేంద్ర కమిటీ, ప్రస్తుతం 5 నుండి 6 మందికి పడిపోయింది. 2025లో నంబాల కేశవరావు (బసవరాజు) మరణం తర్వాత, తిపిరితి తిరుపతి (దేబూజీ) కొత్త జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన కూడా ఫిబ్రవరి 2026లో పోలీసులకు లోంగిపోయారు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో మిసిర్ బెస్రా వంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు మాత్రమే అడవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముగింపు దిశగా ఎర్రజెండా?
ఒకప్పుడు 180 జిల్లాలకు పైగా విస్తరించిన నక్సల్స్ ప్రభావం, ఇప్పుడు కేవలం 3-4 జిల్లాలకే పరిమితమైంది. మార్చి 31 గడువులోగా మిగిలిన వారందరినీ లొంగిపోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 'ఎర్రకోట'గా పిలువబడే అబూజ్‌మాడ్ అడవుల్లో సైతం ఇప్పుడు పోలీసు క్యాంపులు వెలియడం, రోడ్ల నిర్మాణం వేగవంతం కావడంతో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
Follow Us