/rtv/media/media_files/2026/05/05/mamata-banerjee-2026-05-05-17-58-56.jpg)
Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించడం లేదు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని చెప్పడం సంచలనం రేపుతోంది. ఈ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని.. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం కుట్రకు పాల్పడిదంటూ ఆరోపించారు. సాధారణంగా ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే.. సీఎంగా ఉన్న నేత తన పదవికి రాజీనామా చేస్తారు. అయితే మమతా బెనర్జీ తాను సీఎంగా రాజీనామా చేయనని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మే 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
మమతా బెనర్జీ సీఎంగా రాజీనామా చేయకపోయినా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని.. రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. వాస్తవానికి మే 7, 2026 నాటికి పశ్చిమ బెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో గవర్నర్‌కు అసెంబ్లీని, ప్రభుత్వాన్ని రద్దు చేసే పూర్తి అధికారం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ జారీ చేసే ఉత్తర్వుల మేరకే ఎవరైనా సీఎం పదవిలో కొనసాగగలరు. అందుకే ఓటమిపాలైన సీఎం.. రాజీనామా చేయనని పట్టుబట్టినా ఆమెను తొలగించి, కొత్త సీఎంను నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
ఒకవేళ మమతా బెనర్జీ ఎన్నికల ప్రక్రియను సవాలు చేయాలనుకుంటే 'ఎలక్షన్ పిటిషన్' ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ అప్పటిదాకా ఆమె పదవిలో కొనసాగేందుకు వీలు ఉండదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచార్య వెల్లడించారు. రాజ్యాంగ రూల్స్ ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి వీల్లేదు. గవర్నర్ ఉత్తర్వుల మేరకే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మమత బెనర్జీ రాజీనామా చేయనప్పటికీ మే 8 నాటికే రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటు, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం లాంటి ప్రక్రియలు రాజ్యాంగబద్ధంగా జరిగిపోతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow Us