Karnataka New Chief Minister : మే 30న కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం....బిగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే?

కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి రంగం సిద్ధమైంది. మే 30వ తేదీ శనివారం నాడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

New Update
FotoJet (24)

Karnataka New Chief Minister

Karnataka New Chief Minister : కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి రంగం సిద్ధమైంది. మే 30వ తేదీ శనివారం నాడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ అధిష్ఠాన వర్గాల నుంచి నమ్మదగిన సమాచారం అందుతోంది. కొత్త సీఎం పీఠం కోసం పార్టీలో అంతర్గతంగా చర్చలు ముమ్మరమయ్యాయి.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన సంస్థాగత బాధ్యతలను చేపట్టాలని, అందుకోసం రాష్ట్ర నాయకత్వ మార్పునకు సహకరించి మార్గం సుగమం చేయాలని సిద్ధరామయ్యను అధిష్ఠానం కోరినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి నేరుగా ఈ సందేశం రావడంతో, సిద్ధరామయ్య సైతం పదవి నుంచి తప్పుకునేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోటీకి ఎవరి మనసూ నొప్పించకుండా ఫుల్‌స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మే 28 (గురువారం) ఉదయం 10:30 గంటలకు తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లోక్‌భవన్‌కు అధికారిక వినతిపత్రం కూడా అందింది. గవర్నర్‌తో భేటీ అనంతరం సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ శాసనసభ పక్ష (CLP) సమావేశాన్ని నిర్వహించి, అందులో తన రాజీనామాపై సిద్ధరామయ్య అధికారికంగా కీలక ప్రకటన చేయనున్నారు.

రాజీనామా సమర్పించడానికి ముందే గురువారం ఉదయం ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో సహచర క్యాబినెట్ మంత్రులతో అత్యంత ప్రాధాన్యత కలిగిన 'బ్రేక్‌ఫాస్ట్ మీట్' (అల్పాహార విందు) ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బుధవారం మధ్యాహ్నమే బెంగళూరు చేరుకున్నారు. ఆయన రేపు తెల్లవారుజామునే నేరుగా సీఎం నివాసానికి చేరుకుని ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియాతో మాట్లాడి ఊహాగానాలకు ముగింపు పలికే అవకాశం ఉంది.

తదుపరి ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ, తెరపైకి మరో ఆసక్తికరమైన సమీకరణ వచ్చింది. తాను రాజీనామా చేసినా, కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న 'అహింద' (AHINDA) వర్గాలకే సీఎం పదవి కేటాయించాలని సిద్ధరామయ్య అధిష్ఠానం ముందు ప్రతిపాదన పెట్టారు. దీనికి అధినాయకత్వం మొగ్గు చూపితే దళిత నేత, ప్రస్తుత హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కుతుంది. మరోవైపు, 2023 ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీలో భాగంగా తనకే సీఎం పీఠం దక్కాలని డీకే శివకుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఇక కొత్తగా కొలువుదీరబోయే మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా కాంగ్రెస్ అధిష్ఠానం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఈసారి మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు (Deputy cm) చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. వీరిలో షెడ్యూల్డ్ కులాల (SC) వర్గానికి చెందిన ఒకరు, ఓబీసీ (OBC) వర్గానికి చెందిన మరొకరితో పాటు, మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఒక మహిళా నేతకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించనున్నారు. శనివారం జరగబోయే ప్రమాణస్వీకారంతో కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం మొదలుకానుంది.

Advertisment
తాజా కథనాలు