/rtv/media/media_files/2026/03/06/india-2026-03-06-21-05-48.jpg)
India Does Not Need 'Permission' to Buy Oil
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించేందుకు అమెరికా కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై స్పందించిన విపక్షాలు భారత్.. రష్యా చమురు కొనేందుకు అమెరికా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందని విమర్శిస్తున్నాయి. కేంద్రం మాత్రం విపక్షాలు చేసిన ఆరోపణలను ఖండిస్తోంది.
ఫిబ్రవరి 2026 గణాంకాలను పరిశీలించి చూస్తే.. భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇంకా రష్యానే ఉంది. భారతీయ రిఫైనరీలు ప్రతిరోజూ దాదాపు 10 లక్షల నుండి 17 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది దాదాపు 25--30 శాతం ఉంటుంది. అంటే ఒక నెలలో చూసుకుంటే భారత్.. సుమారు 2.8 నుండి 4.8 కోట్ల బ్యారెళ్ల చమురును సేకరించింది. ఈ భారీ గణాంకాలే భారత్‌కు ఎవరి పర్మిషన్‌పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని కనిపిస్తోంది.
భారత్‌కు ఇంధన భద్రత అనేది కీలకమైన అంశం. దేశ అవసరాల్లో దాదాపు 85 శాతానికి పైగా చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ధరల పెరుగుదల, దేశీయ ద్రవ్యోల్బణం, సరఫరా స్థిరత్వం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ చమురు తక్కువ ధరకు ఉంటే ఇది మధ్యతరగతి ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. అందుకే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన వనరులను వైవిధ్యపరిచింది.
అమెరికాతో భారత్ చర్చలు జరుపుతున్నప్పటికీ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందనే ఆరోపణల్లో నిజం లేదని కేంద్రం వాదిస్తోంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో టారిఫ్‌లు, రాయితీలపై చర్చలు జరగడం సహజమేనని చెబుతోంది. గతంలో అమెరికా కొన్ని ఆంక్షలు విధించినా కూడా భారత్ దిగుమతులు ఆపలేదని అంటోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఖతార్ గ్యాస్ ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేయడం ప్రపంచ మార్కెట్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్ తమ ఇంధన నిర్ణయాలను వేరే దేశాలకు అప్పగించవని.. ప్రజల ప్రయోజనాల కోసమే చర్చలు జరుపుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
Follow Us