ED searches : కేరళంలో హైటెన్షన్...మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..

కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కలకలం రేపాయి. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్ లిమిటెడ్‌ (CMRL) మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంతో పాటు మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేపట్టారు.

New Update
FotoJet (26)

Former Kerala Chief Minister Pinarayi Vijayan, daughter Veena

ED searches : కేరళ రాజకీయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన తాజా సోదాలు అత్యంత కలకలం రేపుతున్నాయి. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటిల్ లిమిటెడ్‌ (CMRL) మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. మాజీ సీఎం విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన 'ఎక్స్‌లాజిక్‌ సొల్యూషన్స్‌' సంస్థకు, సదరు ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగిన మోసపూరిత ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ఈడీ విచారణను రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్‌ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసిన మరుసటి రోజే ఈడీ అధికారులు రంగంలోకి దిగడం గమనార్హం.

ఈ సోదాల వివరాల్లోకి వెళితే.. 2017 నుండి 2020 మధ్యకాలంలో సీఎంఆర్‌ఎల్ సంస్థ నుంచి ఎక్స్‌లాజిక్‌ సొల్యూషన్స్‌కు ఎలాంటి ఐటీ సేవలు అందించకుండానే రూ.1.72 కోట్ల నుంచి రూ.2.73 కోట్ల మేర నిధులు అక్రమంగా దక్కాయని సీరియస్‌ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (SFIO) తన అభియోగాల్లో పేర్కొంది. ఈ అక్రమ చెల్లింపుల వివాదంపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) కింద వీణపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తిరువనంతపురంలోని విజయన్ నివాసంతో పాటు కొయికోడ్‌లోని ఆయన అల్లుడు, మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసం పైనా ఈడీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ వివాదం ఇలా ఉంటే, ప్రస్తుత కేరళ సీఎం వీడీ సతీశన్‌ క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు కూడా సీఎంఆర్‌ఎల్ నుంచి నిధులు అందాయని వామపక్ష నేత ఎంఏ బేబీ ఆరోపించడంతో ఈ రాజకీయ రచ్చ మరింత ముదిరింది.

మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయనే విషయం తెలుసుకుని  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)  CPM కార్యకర్తలు, నేతలు విజయన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం కార్యకర్తలు, అక్కడ విధుల్లో ఉన్న ఈడీ అధికారులపై ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యకర్తలు జరిపిన ఈ దాడిలో అక్కడ రక్షణగా ఉన్న పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా, ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు ఈడీ అధికారుల వాహనాన్ని (కారును) కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో కేరళ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కేరళవ్యాప్తంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడులు జరిగినప్పటికీ ఈడీ అధికారులు తమ నిఘాను, కీలక పత్రాల సేకరణను కొనసాగిస్తున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్‌ఎఫ్‌ఐఓ సేకరించిన ఆధారాల బట్టే ఈ దాడులు జరుగుతున్నాయని, విచారణకు సహకరించాల్సిందేనని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తమ నాయకత్వాన్ని అభాసుపాలు చేయడానికే కేంద్రం ఈ కుట్రలకు తెరలేపిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే జరిగిన ఈ ఆకస్మిక దాడులు, కార్యకర్తల ప్రతిఘటనతో ప్రస్తుతం కేరళ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు