Ghaziabad : గాజియాబాద్‌లో సంచలనం: యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్!

గాజియాబాద్‌లో కొన్ని రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఓ యువకుడి హత్య కేసు చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. సూర్యప్రతాప్ చౌహాన్ (17) అనే మైనర్ యువకుడిని కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

New Update
FotoJet (59)

Ghaziabad Encounter Accused Asad passed away

Ghaziabad : ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్‌లో కొన్ని రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఓ యువకుడి హత్య కేసు చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. సూర్యప్రతాప్ చౌహాన్ (17) అనే మైనర్ యువకుడిని కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మోటార్ సైకిల్ నడిపే విషయమై సూర్యప్రతాప్ చౌహాన్, అసద్‌ల మధ్య కొన్ని నెలల క్రితం వివాదం చెలరేగింది. ఆ పాత గొడవను మనసులో పెట్టుకున్న అసద్, ఈ నెల 28న బక్రీద్ (ఈద్) పండుగను పురస్కరించుకుని సూర్యను తన ఇంటికి ఆహ్వానించాడు. స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన సూర్యను.. అసద్ తన మరికొందరు సహచరులతో కలిసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అయితే, బాధితుడి తల్లిదండ్రుల ఆరోపణలు మరోలా ఉన్నాయి. పండుగ పేరు చెప్పి తమ కుమారుడిని ఏడుగురు వ్యక్తులు బయటకు తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

పోలీసుల వేట.. రూ. 50 వేల రివార్డు

సూర్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అందులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడైన అసద్ పరారయ్యాడు. నగరంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతడి తలపై రూ. 50,000 రివార్డు కూడా ప్రకటించారు. నగరం విడిచి పారిపోవాలని ప్లాన్ చేసిన అసద్, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖోడా ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఇందిరాపురం పోలీసులు అప్రమత్తమై, ఆయా మార్గాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.

లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా..

బైక్‌పై అసద్ తన మరో స్నేహితుడితో కలిసి రావడం గమనించిన పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. లొంగిపోవాలని గట్టిగా హెచ్చరించారు. అయితే పోలీసులు మాట లెక్కచేయని అసద్, ఒక్కసారిగా తన వద్ద ఉన్న నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు తక్షణమే ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసుల బుల్లెట్ తగలడంతో అసద్ తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి నిందితుడు వాడిన ఒక నాటు తుపాకీ, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పుల సమయంలో అసద్‌తో పాటు బైక్‌పై ఉన్న అతని స్నేహితుడు అక్కడి నుంచి చీకట్లోకి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్న నిందితులందరినీ ఎన్‌కౌంటర్ చేయాలని, అప్పుడే తమకు పూర్తి న్యాయం జరుగుతుందని సూర్యప్రతాప్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనతో ఘజియాబాద్ ఇందిరాపురం పరిసర ప్రాంతాల్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Advertisment
తాజా కథనాలు