/rtv/media/media_files/2026/03/24/bjp-kerala-seal-2026-03-24-07-06-08.jpg)
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన అధికారిక లేఖపై ఏకంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ముద్ర ఉండటం రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈసీ తీరుపై కేరళలోని అధికార సీపీఎం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్‌మెంట్ రాజకీయ పార్టీలకు ఎన్నికల మార్గదర్శకాలకు సంబంధించి ఓ సర్క్యులర్‌ను పంపింది. అయితే, ఆ లేఖపై సాధారణంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ అధికారిక ముద్రకు బదులుగా, బిజెపి పార్టీ కార్యాలయానికి సంబంధించిన సీల్ స్పష్టంగా కనిపించింది. ఈ లేఖను కేరళ సీపీఎం పార్టీ సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
𝐀 𝐁𝐉𝐏 𝐬𝐞𝐚𝐥 𝐨𝐧 𝐚𝐧 𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐂𝐨𝐦𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐥𝐞𝐭𝐭𝐞𝐫!
— Surya Reddy (@jsuryareddy) March 23, 2026
A letter sent by the Election Commission to political parties carried the seal of the BJP Kerala unit instead of the Election Commission’s seal.
- @INCIndiahttps://t.co/i65ZFBd5sV
సీపీఎం తీవ్ర ఆరోపణలు
ఎన్నికల కమిషన్ అధికారిక లేఖపై ఒక రాజకీయ పార్టీ ముద్ర ఉండటమేంటని సీపీఎం ప్రశ్నించింది. ఇది కేవలం సాంకేతిక పొరపాటు మాత్రమే కాదని, స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనమని మండిపడింది. "భారత ఎన్నికల సంఘం, బీజేపీ.. ఈ రెండింటినీ ఒకే అధికార కేంద్రం నియంత్రిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది." అని సీపీఎం తన పోస్ట్‌లో పేర్కొంది.
ఈ ఘటనతో ఈసీ తటస్థ వైఖరిపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, బీజేపీ కార్యాలయాలే ఈసీని నడుపుతున్నాయా? అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈసీ వివరణ: ఇది కేవలం 'క్లరికల్ మిస్టేక్'
వివాదం ముదరడంతో కేరళ ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే స్పందించారు. జరిగిన తప్పును అంగీకరిస్తూనే, దీనిని ఒక 'క్లరికల్ మిస్టేక్'గా చెప్పుకొచ్చారు. 2019 నాటి ఎన్నికల మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ గతంలో బీజేపీ రాష్ట్ర విభాగం ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. అప్పుడు బీజేపీ ప్రతినిధులు తమ పార్టీ ముద్ర వేసిన మార్గదర్శకాల పత్రాన్ని ఓ కాపీ ఈసీ అధికారులకు సమర్పించారు. అదే పత్రాన్ని ఈసీ సిబ్బంది స్కాన్ చేసి, పొరపాటున ఇతర రాజకీయ పార్టీలకు సమాచారం నిమిత్తం పంపారు.
బీజేపీ ఇచ్చిన కాపీనే యథాతథంగా పంపడం వల్లే ఈ వివాదం తలెత్తిందని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలాంటి అజాగ్రత్తలు రాజ్యాంగ సంస్థల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us