Kerala CM: కాంగ్రెస్ లో కేరళ పంచాయితీ.. సీఎంను ప్రకటించని హైకమాండ్.. కారణం అదేనా?

కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తేలలేదు. సీఎం కుర్చీ కోసం ముగ్గురు అగ్రనేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నేతల అనుచరులు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

New Update
Kerala

Kerala

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తేలలేదు. సీఎం కుర్చీ కోసం ముగ్గురు అగ్రనేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల రేసులో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయా నేతల అనుచరులు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. తమ నేతనే సీఎం చేయాలంటూ ఎవరికి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు లేకుండా చూడాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ ముగ్గురు నేతలను గట్టిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సమస్య పరిష్కారం కోసం నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. అతి త్వరలోనే కేరళ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని AICC ఇన్‌చార్జ్ దీనా దాస్ మున్షీ తెలిపారు. అయితే ఈ సీఎం రేసులో AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ జాతీయ స్థాయిలో బలమైన నేతగా ఉన్న ఆయనకు సీఎం పదవి దక్కాయని తన అనుచరులు కోరుతున్నారు. 

Also Read: తమిళనాడు అసెంబ్లీలో సంచలనం.. జయలలిత ఫోటోతో TVK మంత్రి ప్రమాణం!

కొత్తగా గెలిచిన 63 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో సుమారు 43 మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌కే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. హైమకమాండ్‌కు కూడా పార్టీ పరిశీలకులు ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. దీంతో రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు వేణుగోపాల్‌ను కేరళ రాజకీయాలకే పరిమితం చేస్తారా లేదా జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహకర్తగానే కొనసాగిస్తారా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

LDF ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన విపక్ష నేత వీడీ సతీశన్‌కే సీఎం పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సతీశన్‌కు UDF మిత్రపక్షమైన  ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా సపోర్ట్ చేసింది. సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల అనుచరులు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెన్నితల గతంలో పార్టీ కోసం సీనియారిటీని పక్కనపెట్టి ఎన్నో త్యాగాలు చేసినట్లు గుర్తుచేస్తున్నారు.

ఈ ముగ్గురు కీలక నేతల్లోనే ఎవరికో ఒకరికి సీఎం పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు వీళ్ల ముగ్గురికి మంచి ప్రజాదారణ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో అనేదానిపై హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. అందుకే సీఎం పేరు ప్రకటించేందుకు ఇంతగా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్‌ ఎవరికి సీఎం పదవి అప్పగిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: పెరగనున్న నిత్యావసరాల ధరలు...సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు!

#telugu-news #kerala #national #rtv-news
Advertisment
తాజా కథనాలు