![Arvind Kejriwal and Ajay Maken](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/22/yh4iiLnfXsL1x6svL4lF.jpg)
Arvind Kejriwal and Ajay Maken
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆరోగ్యశాఖలో ఆప్ ప్రభుత్వం రూ.382 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడినట్లు 14 కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) రిపోర్టులు చెబుతున్నాయని పేర్కొన్నారు. '' అవినీతిపై పోరాడుతామని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
ఢిల్లీ లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం జరిగనట్లు కాగ్ రిపోర్టులో ఉంది. ఆప్ నేతల అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని అసెంబ్లీలో రిపోర్టులు ప్రవేశపెట్టకుండా ఆపేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం మంజూరు చేసిన నిధుల్లో 56 శాతం నిధులను ప్రజల సంక్షేమానికి కేటాయించడంలో ఆప్ విఫలమైంది. ఆస్పత్రుల్లో రోగుల కోసం పడక గదులు పెంచేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్కూళ్లు, కాలేజీల కోసం కేటాయించిన 14 ప్లాట్లను ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు.
Also Read: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్
గత 10 ఏళ్లలో చూసుకుంటే కేవలం మూడు ఆస్పత్రులు మాత్రమే నిర్మించారు. అవి కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినవే. ఇందిరాగాంధీ ఆస్పత్రి నిర్మాణం కోసం టెండర్ కన్నా రూ.314 కోట్లు ఎక్కువగా ఖర్చు చేశారు. అలాగే బురారీ ఆస్పత్రికి రూ.41 కోట్ల, మౌలానా ఆజాత్ డెంటల్ ఆస్పత్రికి రూ.26 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారని.. అజయ్ మాకెన్ విమర్శలు చేశారు. ఇదిలాఉండగా ఫిబ్రవరి 5న 70 అసెంబ్లీ స్థానాలకు ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దేశ రాజధానిలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.