/rtv/media/media_files/2025/03/22/Pd4Uhf2PFkMWcgyZtiNm.jpg)
CM Stalin and CM revanth
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు.
కేరళ సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. జనాభా పరంగా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగి, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనుసరించాల్సిన వ్యూహాలపై డీఎంకే నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Also Read: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడారు. '' జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమందరం వ్యతిరేకించాలి. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతే అభిప్రాయాలు చెప్పేందుకు బలం తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి వస్తుంది. మన అనుమతితో సంబంధం లేకుండానే చట్టాలు చేయబడతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు. రైతులకు మద్దతు లేకుండా పోతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది.
మొత్తానికి సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుందని'' స్టాలిన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని.. న్యాయబద్ధంగా, పారదర్శంగా డీలిమిటేషన్ చేయాలనే డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. '' డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను పరిమితం చేస్తుంది. న్యాయబద్ధం కాని డీలిమిటేషన్‌పై మనం బీజేపీని అడ్డుకోవాలి. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్ధమంతంగా అమలు చేశాం. ఉత్తరాదిలో ఇది అమలు కాలేదు. ఆర్థికాభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది.దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ.. మనకు వచ్చేది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి వచ్చేది 42 పైసలే. బీహార్‌లో రూపాయి పన్ను కడితే ఆరు రూపాయలు వస్తున్నాయి. యూపీకి రూపాయికి 2 రూపాయల 3 పైసలు వస్తు్న్నాయని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
మరోవైపు ఈ సమావేశంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకుఈ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ దుయ్యబట్టారు. కావేరీ జలాలు, ఇతరాత్ర కీలక అంశాలపై ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
stalin | national-news