ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎన్నికల ఎగ్జి్ట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఈసారి చూసుకుంటే మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ అనే ప్రముఖ సంస్థ బీజేపీ ఏకంగా 51 నుంచి 60 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకే పరిమితం అవుతుందని తమ సర్వేలో వెల్లడించింది. అలాగే చాణక్య స్ట్రాటజీ, ఆపరేషన్ చాణక్య, పీపుల్ ఇన్‌సైట్, పీ మార్క్ లాటి పలు సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన మెజార్టీ ఇచ్చాయి.
మాట్రిజ్ అనే సంస్థ తన సర్వేలో ఆప్, బీజేపీకి గట్టి పోటీ ఉండనున్నట్లు తెలిపింది. ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికారంలోకి రావాలంటే మేజిక్ ఫిగర్ 36 స్థానాల్లో గెలవాలి. మాట్రిజ్ లెక్క ప్రకారం హంగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే టైమ్స్ నౌ కూడా ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు పేర్కొంది. బీజేపీ 39-45, ఆప్ 22 -31 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీకి మెజార్టీ ఇచ్చినప్పటికీ.. ఆప్ కూడా దీనికి చేరువలో ఉండనున్నట్లు తమ సర్వేలో వెల్లడించింది. అయితే కేకే పోల్ సంస్థ మాత్రం వీటన్నిటికి విరుద్ధంగా ఫలితాలు ఇచ్చింది. ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఆప్‌కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
Also Read: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల.. గెలుపు ఆ పార్టీదే
అప్పుడు ఆప్‌దే పైచేయి
2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే అన్నీ సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కు భారీ మెజార్టీనీ అంచనా వేశాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా 2020లో ఆప్‌కు 59 నుంచి 68 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ.. ఆప్ 47 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. చాలావరకు మెజార్టీ సర్వేలు ఆప్ 50 కంటే ఎక్కవ స్థానాల్లోనే గెలుస్తుందని అంచనా వేశాయి. చివరికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా టీవీ- సీ ఓటర్ సర్వే.. ఆమ్ ఆద్మీ పార్టీకి 35-43, బీజేపీకి 25-33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే - సిసిరో ఆప్ 38-46, బీజేపీ19 -27 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. మెజార్టీ సర్వేలు ఆప్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. చివరికి 2015 ఎన్నికల్లో ఎవరూ ఉహించని విధంగా ఆప్ 67 స్థానాల్లో గెలిచి అధికారం సొంతం చేసుకుంది. బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యింది.
ఆప్‌కు సవాలు
ఇక 2024 ఎన్నికలను పరిశీలిస్తే మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఆప్ అధికారం నిలబెట్టుకునేందుకు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2013 నుంచి 2024 వరకు ఆప్ అధికారంలో ఉంది కాబట్టి.. ఈసారి ఢిల్లీ వాసులు బీజేపీకి అధికార పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఈ లెక్కలు చూస్తే అర్ధమవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజల్లో ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
Also Read: హంగ్ తప్పదా..? ఢిల్లీలో అధికారం కోసం ఏ 2 పార్టీలు కలుస్తాయి..!
మేజిక్ ఫిగర్ వచ్చినా కష్టమే
ఒకవేళ హంగ్ వచ్చినా కూడా బీజేపీయే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కేజ్రీవాల్ మళ్లీ అరెస్ట్ కావొచ్చనే భయంతో పలువురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ తేలికగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆప్ అధికారంలోకి రావాలంటే 50కి పైగా స్థానాల్లో గెలుస్తేనే బలంగా నిలబడగలుగుతుంది. 35 నుంచి 45 స్థానాల్లో గెలిచినా బీజేపీ అధికారం చేజిక్కుంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆప్‌కు మేజిక్ ఫిగర్ సీట్లు వచ్చినా కూడా అధికారం సొంతం చేసుకోలేని రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. మరీ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.