/rtv/media/media_files/2026/05/23/bjp-2026-05-23-10-17-53.jpg)
Eetala Rajendar, Dharmapuri Arvind and K.Laxman
త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణకు మరో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా బీసీ సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన ఒక ఎంపీకి కేంద్ర కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం బీజేపీ తరఫున 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో బీసీ నేతలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పదవులను కొనసాగిస్తూనే, మరో నేతకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు కేంద్ర కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడమే సరైన ప్లాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, మున్నూరు కాపు నుంచి బండి సంజయ్ ఉన్నారు. అయితే కొత్తగా రేసులోకి వచ్చిన బీసీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లలో ఎవరికో ఒకరికి కేంద్ర మంత్రి పదవి రానుంది. అయితే వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఢిల్లీ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. వీళ్లిద్దరి రాజకీయ బలాబలాలు, సామాజిక సమీకరణాలను అధిష్ఠానం అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: సోషల్ మీడియాను ఊపేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ (CJP)'.. విదేశీ కుట్రపై ఇంటెలిజెన్స్ ఆరా!
సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే తెలంగాణ బీసీ జనాభాలో ముదిరాజ్ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ వర్గానికి పెద్దపీట వేయాలని బీజేపీ నిర్ణయిస్తే మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఖాయమయ్యే ఛాన్స్ ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే సామాజిక వర్గానికి రెండో ఛాన్స్ ఇస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన తెలంగాణ నేత, అదే మున్నూరు కాపు వర్గానికి చెందిన డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ బీసీ కోటా ఎవరికి వస్తుందనేది ఆసక్తికగా మారింది.
Follow Us