/rtv/media/media_files/2025/05/19/ENnUuCAhkhSBW4H1DJhi.jpg)
IPL 2025 gujarat titans
Gujarat Titans : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న అధికారిక బస్సులో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో ఫ్రాంచైజీ యాజమాన్యం, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేడియం నుంచి ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ తమకు కేటాయించిన ప్రత్యేక బస్సులో బస చేసిన హోటల్‌కు తిరుగుపయనమయ్యారు. ప్రయాణంలో ఉండగా అర్ధరాత్రి సమయంలో బస్సు నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం గమనించిన డ్రైవర్, సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు.
పొగలు రావడాన్ని గుర్తించిన వెంటనే ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల వ్యవధిలో బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. వారు కిందకు దిగిన కొద్దిసేపటికే బస్సులో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సులోని ఎయిర్ కండిషనర్ (AC) వైరింగ్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు సకాలంలో స్పందించి కిందకు దిగకపోతే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బస్సు తగలబడుతున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు, సహాయక సిబ్బంది కాసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం సమాచారం అందుకున్న ఫ్రాంచైజీ నిర్వాహకులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరో ప్రత్యేక బస్సును అక్కడికి పంపించి, ఆటగాళ్లను సురక్షితంగా వారు బస చేసిన హోటల్‌కు చేర్చారు. ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన నిరాశలో ఉన్న గుజరాత్ జట్టుకు, ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించినప్పటికీ ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us