Jishnu Dev Varma: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం.

New Update
Jishnu Dev Varma: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్‌ వర్మను కేంద్రం తెలంగాణ గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం సైతం చేశారు. ఇంత వరకు త్రిపుర నుంచి ఎవరూ గవర్నర్ గా పని చేయలేదు. ఆ రాష్ట్రానికి నుంచి గవర్నర్ పదవి దక్కించికున్న తొలి వ్యక్తిగా జిష్ణు దేవ్ రికార్డు సృష్టించారు.

Also Read: జీవిత, వైద్య బీమాపై పన్ను రద్దు చేయండి: నిర్మలమ్మకు నితిన్ గడ్కరీ లేఖ!

జిష్ణుదేవ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న జన్మించారు జిష్ణుదేవ్. ఈయన త్రిపురలోని మణిక్య రాజవంశానికి చెందిన వారు కావడం విశేషం. 1400 సంవత్సరంలో త్విప్‌రా రాజ్యాన్ని ఈ మాణిక్య రాజవంశమే పాలించేది. ఈశాన్య భారత్‌లోని చాలావరకు భూభాగం ఈ రాజవంశం నియంత్రణలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత 1761లో బ్రిటీషర్లు మన దేశానికి వచ్చాక.. వీరి ప్రభావం కాస్త తగ్గింది. అయినా.. మాణిక్య రాజవంశానికి చెందిన జిష్ణదేవ్ పూర్వికులు 1949 వరకు త్రిపుర ప్రాంతాన్ని పాలించారు. ఆ ఏడాదే రాచరిక పాలనలో కొనసాగుతున్న త్రిపుర.. భారత్‌లో విలీనమైంది.

బీజేపీలో చేరిక

1990లో రామజన్మ భూమి ఉద్యమం సమయంలో జిష్ణుదేవ్ వర్మ బీజేపీలో చేరారు. ఈ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1993లో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్ అసోషియేషన్‌కి అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర రెండో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. అయితే.. గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సెపాహిజాలా జిల్లా చరిలం స్థానం నుంచి పోటీ చేసిన జిష్ణుదేవ్ ఓటమిపాలయ్యారు. అనంతరం.. ఈ నెల 27న ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఉత్తర్వులు జారీ చేశారు.

త్రిపురకు తెలంగాణ వ్యక్తి గవర్నర్..

అయితే జిష్ణు దేవ్‌ వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమించడం వెనుక బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని కేంద్ర ప్రభుత్వం త్రిపుర గవర్నర్‌గా నియమించింది. అలాగే తెలంగాణకు త్రిపురకు చెందిన వ్యక్తిని తాజాగా తెలంగాణ గవర్నర్‌గా నియమించడంతో ఈ చర్చ ప్రారంభమైంది. గతంలో తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ గవర్నర్ గా పని చేసిన సమయంలో కేసీఆర్ సర్కార్ తో ఆమెకు తీవ్ర విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన జిష్ణు దేవ్ రేవంత్ రెడ్డి సర్కార్ తో ఎలా వ్యవహరిస్తారు? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ జిష్ణుదేవ్‌ వర్మ సైతం తమిళ సై మాదిరిగా వ్యవహరిస్తే.. కొద్ది రోజుల క్రితమే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్‌కు ఇబ్బందిగా మారొచ్చు.

Also Read: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ

Advertisment
Advertisment
తాజా కథనాలు