జనసేన కేంద్ర కార్యాలయం తరలింపు.. ఎక్కడికంటే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్‌ తన నివాసాన్ని ఏపీకి మార్చారు.

New Update
జనసేన కేంద్ర కార్యాలయం తరలింపు.. ఎక్కడికంటే.!

Janasena party Head office moving to Mangalagiri? : జనసేన కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌ నుంచి మారబోతోందా..? పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) ఇక అక్కడే ఉండబోతున్నారా..? సినిమాలకు సంబంధించిన అంశాలపై కూడా అక్కడే చర్చింబోతున్నారా..? షూటింగ్‌లు ఉంటేనే పవన్‌ హైదరాబాద్‌కు వస్తారా..? ఇప్పటికే జనసేన కార్యాలయ సిబ్బంది ఫైళ్లను, కంప్యూటర్లను తరలించారా..? పవన్ ఇక సినిమాలకు దూరంగా ఉండబోతున్నారా..?

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల్లో తిరుగుతున్న జనసేన(Janasena) అధినేత పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నివాసం హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తనకు అనుకూలంగా ఉండేలా మంగళగిరిలోని తన నివాసాన్ని మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో రెండు విడుతలుగా వారాహి యాత్ర చేపట్టి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పవన్‌.. ఇక పూర్తి స్థాయిలో ఏపీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు, అందులో భాగంగానే తాను హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలస్తోంది. దీనికోసం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి తరలించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనసేన సిబ్బంది పార్టీకి చెందిన ఫైళ్లను, కంప్యూటర్లను అక్కడికి తరలించినట్లు సమాచారం. జనసేన సోషల్‌ మీడియా టీమ్‌ ఇకపై మంగళగిరి నుంచే పనిచేయబోతోన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తోన్నాయి. సోషల్‌ మీడియా ద్వారా ఏపీలో యువతను ఎప్పటికప్పుడు చైతన్య పరిచే దిశగా పవన్‌ కళ్యాణ్‌ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్న జనసేనాని.. అందులో భాగంగానే తన నివాసాన్ని హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి మార్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అధికార పక్ష నేతలు ఇటీవల పవన్‌ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతున్నట్లు, యాత్రలు ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నట్లు ఆరోపించారు. అంతే కాకుండా ప్రజలు సైతం పవన్‌ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఉంటే తమ కష్టాలు ఎలా తెలుస్తాయని అనుకుంటున్నట్లు టాక్‌ వచ్చిన నేపథ్యంలో మంగళగిరికి మకాం మార్చాలని జనసేన అధ్యక్షుడు భావించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తోన్నాయి.

మరోవైపు ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు విడతలుగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనసేన అధ్యక్షుడు శాశ్వతంగా అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం. తనతో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్లు మంగళగిరికివచ్చి సినిమాల గురించి చర్చించాలని పవన్ ఇండస్ట్రీ వర్గాలకు సూచించినట్లు టాక్‌ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ ఇక రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్లు, మధ్య మధ్యలో సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు