Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..?

పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

New Update
Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..?

పాకిస్థాన్‌లో నిన్న (గురువారం) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే పాకిస్థాన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికలు ఫలితాలు మాత్రం పాకిస్థాన్ ఆర్మీ లెక్కలకు సవాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పీఎంఎల్‌-ఎన్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ.. పార్టీ పనితీరు అంచనాలకు తగ్గట్లు లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.

జైల్లో ఉండగానే ప్రచారం

ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆయన్ని అరెస్టు చేయడం పాకిస్థాన్‌లో తీవ్ర దుమారం రేపింది. అంతేకాదు ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా వేటు వేశారు. ఆయన పార్టీ 'పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌' (PTI) గుర్తును కూడా ఎన్నికల్లో వినియోగించకుండా అనుమతి ఇవ్వకపోవడం కూడా జరిగింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు బలవంతంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో ఉండగానే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌(AI), సోషల్ మీడియా సాయంతో ప్రచారాలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలగడం వల్ల ఆయన ప్రయత్నాలు తరచుగా విఫలమయ్యేవి.

Also Read: వెనుకబడిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపించకూడదు : సుప్రీంకోర్టు

మేమే గెలుస్తున్నాం

మరోవైపు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను తారుమారు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణిచివేత ఘటనలు జరిగినప్పటికీ.. ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెలిపింది. ప్రతి ఏడాది పోలింగ్‌ స్టేషన్‌లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పింది. రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు చేసింది.

133 సీట్లు వస్తేనే అధికారం 

అంతేకాదు పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి మరీ నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నారని పీటీఐ ఆరోపిస్తోంది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని.. రిగ్గింగ్ ఎన్నికలను పాక్ ప్రజలు అంగీకరించని చెప్పింది. మరోవైపు విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ జోరు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాబ్‌ షరీఫ్‌ పీఎంఎల్ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా.. 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 265 చోట్లే పోలింగ్ జరిగింది. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే కనీసం 133 సీట్లు గెలవాలి. ఇక మిగతా 70 స్థానాలు మైనార్టీలు, మహిళలకు కేటాయించారు. ఇక పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also read: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు