/rtv/media/media_files/2025/02/24/QDJznALJSGWW5aXBBrD8.jpg)
50501 Movement Against Trump's Administration in USA
2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం, థర్డ్ జెండర్‌ను తొలగించడం, మహిళల గర్భ విచ్చిత్తి హక్కు, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, LGBTQ హక్కులకు సంబంధించి ఇలా అనేక అంశాలపై ట్రంప్ ప్రభుత్వం ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌లు జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికాలో వివాదాస్పదంగా మారాయి. దీంతో అక్కడి ప్రజలకు రోడ్లపైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. '50501 ఉద్యమం' పేరుతో అమెరికావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దశల వారిగా ఆందోళనలు చేస్తున్నారు.
50501 ఉద్యమం అంటే ఏంటి ?
50501 ఉద్యమం అనేది ఒక రాజకీయ యాక్టివిస్ట్ గ్రూప్. ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. అమెరికా ప్రజలందరినీ ఏకం చేయడమే ఈ ఉద్యమం లక్ష్యం. 50501 అంటే '50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక రోజు(1)' అని అర్థం. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓరోజు మొత్తం అమెరికా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 50501 ఉద్యమం గురించి రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 5న మొదటిసారిగా 50501 ఉద్యమం జరిగింది. ఆ రోజున వివిధ రాష్ట్రాల్లో అమెరికా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్!
ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి, డబ్బును ఆదా చేసేందుకు.. ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని ఇటీవలే ప్రణాళిక వేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు పెరుగుతున్నాయని, ఇది ఆర్థికనేరగాళ్ల సంస్థ అంటూ ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు. దీంతో మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్ (DOGE) ఇప్పటికే చాలామంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది. అంతేకాదు యూఎస్ ఎయిడ్‌కు నిధులు కూడా ఆపేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిరసనలు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉద్ధృతమయ్యాయి.
ట్రంప్, ఎలాన్ మస్క్‌పై తీవ్ర వ్యతిరేకత
ఫిబ్రవరి 5 తర్వాత.. ఫిబ్రవరి 17న రెండోసారి అమెరికా వ్యాప్తంగా 50501 ఉద్యమం చేశారు. కాలిఫోర్నియా, టేనస్సీ, మసాచుసెట్స్, న్యూయార్క్, బోస్టన్ లాంటి దాదాపు సగం రాష్ట్రాల్లో ఆ రోజున ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్, ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వాషింగ్టన్‌లో ఉన్న వైట్‌హౌస్ ముందు కూడా ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 'ప్రెసిడెంట్స్ డే రోజున రాజులు వద్దు', 'ఎలాన్ మస్క్‌కు ఓటు వేయలేదు' వంటి రాతలతో ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారు. 50501 ఉద్యమం గ్రూప్ కూడా తమ వెబ్‌సెట్‌లో ఓ కీలక ప్రకటన చేసింది.'' చరిత్రలో క్లిషమైన సమయంలో మేము ధృడంగా నిలబడ్డాం. ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వ పాలన ఉండాలి, బిలియనీర్ అయిన ఎలాన్ మస్క్ కోసం కాదని మేము డిమాండ్ చేస్తున్నామని'' పేర్కొంది.
Video: Hundreds gather outside the U.S. Capitol in Washington, D.C. to protest Donald Trump and Elon Musk's overhaul of the federal government and the terminations of thousands of federal workers.
— AZ Intel (@AZ_Intel_) February 17, 2025
pic.twitter.com/uN2FQUV4SD
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ ట్రంప్‌కు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ట్రంప్‌తో పాటు ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ఎలాన్ మస్క్‌కు ఆయన ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE)ని ఏర్పాటు చేసి దీని బాధ్యతలు మస్క్‌కు అప్పగించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు (DOGE) డోజ్ ఇప్పటికే చాలామంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసింది.
ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం, వలసవాదంపై ఉక్కుపాదం, LGBTQ హక్కులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే ఈ 50501 ఉద్యమం పేరిట అమెరికా అంతటా నిరసనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 17న రెండుసార్లు ఈ నిరసనలు చేయగా.. మార్చి 4న ఈ 50501 ఉద్యమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇలా దశల వారిగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయని ఉద్యమ నిర్వాహకులు చెబుతున్నారు.