Indo-Pacific Command : భారత్‌కు షాకిచ్చిన అమెరికా : 'ఇండో' పదం తొలగింపు, వివాదాస్పద మ్యాప్..

ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ తరుణంలో అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ పేరునుంచి ఇండో పదాన్ని తిలగించింది.

New Update
FotoJet

Indo-Pacific Command

Indo-Pacific Command : ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరగనున్న తరుణంలో అగ్రరాజ్యం తీసుకున్న ఒక ఊహించని నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గతంలో ప్రకటించిన అమెరికా, ఇప్పుడు తన రక్షణ పరిభాష నుంచి 'ఇండో' అనే పదాన్ని అధికారికంగా తొలగించింది. తన అత్యంత కీలకమైన సైనిక కమాండ్ ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ (US Indo-Pacific Command) పేరును తిరిగి ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మారుస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించడం ఇరు దేశాల రక్షణ సంబంధాలలో చర్చనీయాంశంగా మారింది.

ఈ పేరు మార్పు వివాదానికి తోడు, అమెరికా రక్షణ శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక సైనిక మ్యాప్ భారత్‌కు మరింత ఆగ్రహం తెప్పించేలా ఉంది. ఈ కమాండ్ ఏయే ప్రాంతాల్లో సేవలందిస్తుందో వివరించేందుకు ఉంచిన ఆ చిత్రపటంలో 'పాక్ ఆక్రమిత కశ్మీర్' (PoK)ను పాకిస్థాన్ భూభాగంలో భాగంగా చూపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్ సార్వభౌమాధికారానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంలో అమెరికా ఇటువంటి మ్యాప్‌ను ప్రదర్శించడం వ్యూహాత్మక వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చారిత్రక నేపథ్యం.. ట్రంప్ యూ-టర్న్..

ఈ పసిఫిక్ కమాండ్‌కు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఈ ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’ను ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు విస్తరించి ఉన్న ఈ కమాండ్.. కొరియా, వియత్నాం యుద్ధాలతో పాటు ప్రాంతీయ స్థిరత్వంలో, మానవతా రక్షణ చర్యల్లో ఏడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ తన మొదటి విడత అధికారంలో ఉన్నప్పుడు, 2018లో హిందూ మహాసముద్రం-పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న భౌగోళిక, ఆర్థిక అనుసంధానతను గుర్తిస్తూ, భారత్‌కు ప్రాధాన్యత ఇస్తూ దీని పేరును ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’గా మార్చారు. నాటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ ఈ మార్పును ప్రతిపాదించారు. కానీ, సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చాక అమెరికా ఈ విషయంలో పూర్తి యూ-టర్న్ తీసుకోవడం గమనార్హం.

అమెరికా వివరణ.. భారత్‌లో వ్యక్తమవుతున్న అనుమానాలు..

ఈ పేరు మార్పుపై అమెరికా రక్షణ శాఖ విదేశీ వ్యూహాల్లో మార్పులేమీ లేవని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. కేవలం చారిత్రక మూలాలను (Legacy) గౌరవించడానికి, పసిఫిక్ ప్రాంతంలో సేవలందించే సైనికులలో స్ఫూర్తిని నింపడానికే పాత పేరును పునరుద్ధరించామని, దీనివల్ల కమాండ్ బాధ్యతల్లో గానీ, వ్యూహాత్మక లక్ష్యాల్లో గానీ ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అయినప్పటికీ, మోదీ-ట్రంప్ భేటీ సమయానికే ఈ పరిణామం చోటుచేసుకోవడం వెనుక బలమైన రాజకీయ, రక్షణ సంకేతాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాను కట్టడి చేసే క్రమంలో వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల నుంచి భారత్‌ను అమెరికా నెమ్మదిగా దూరం పెడుతోందా? లేదా ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అగ్రరాజ్యం ఆడుతున్న మైండ్ గేమా? అనే కోణంలో అంతర్జాతీయ విశ్లేషకులు దీనిని విశ్లేషిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు