/rtv/media/media_files/2026/04/03/tariffs-2026-04-03-16-00-12.jpg)
అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. జాతీయ భద్రత, సప్లై చెయిన్ పటిష్టత సాకుతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ (బ్రాండెడ్) ఔషధాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు(trump tarrifs) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం నిర్దేశించిన ధరల ఒప్పందాలకు తలొగ్గని కంపెనీలకే ఈ భారీ జరిమానా వంటి సుంకాలు వర్తిస్తాయి.
Also Read : బంగ్లాదేశ్‌లో లాక్‌డౌన్.. ఆఫీసు, షాపుల పనివేళల్లో మార్పులు
ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
అమెరికాలో పంపిణీ అవుతున్న పేటెంట్ మందులలో53 శాతం దేశం వెలుపలే తయారవుతున్నాయి. అలాగే కీలకమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (APIs) కేవలం 15 శాతం మాత్రమే అమెరికాలో తయారవుతున్నాయి. యుద్ధాలు లేదా ఇతర సంక్షోభాల సమయంలో విదేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్, అరుదైన వ్యాధులు, క్లిష్టమైన ఇన్ఫెక్షన్లకు వాడే ప్రాణరక్షక మందుల విషయంలో అమెరికా 'స్వయం సమృద్ధి'ని కోరుకుంటోంది. అందుకే "స్వయం సమృద్ధి" సాధించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమలులోకి రావడానికి పెద్ద కంపెనీలకు 120 రోజులు, ఇతరులకు 180 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పటికే 13 ప్రధాన కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
కొత్త సుంకాల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0% సుంకం: "మోస్ట్ ఫేవరడ్ నేషన్" ధరల ఒప్పందంపై సంతకం చేసి, అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించే కంపెనీలకు ఎటువంటి సుంకం ఉండదు.
20% నుండి 100% సుంకం: ధరల ఒప్పందం లేకుండా అమెరికాలో ప్లాంట్లు నిర్మించే వారికి మొదట 20% సుంకం విధిస్తారు. ఇది నాలుగేళ్లలో 100 శాతానికి పెరుగుతుంది.
Also Read : పాకిస్థాన్‌లో బతకడం ఘోరం.. లీటర్ డీజిల్ రూ. 520 బాసూ.. పెట్రోల్ ఎంతో తెలుసా?
ఇండియాపై ఎఫెక్ట్
భారతీయ ఫార్మా రంగం(pharma-industry)పై ఈ నిర్ణయం మిశ్రమ ప్రభావాన్ని చూపనుంది. భారతీయ సంస్థలు ఆధిపత్యం చెలాయించే జెనరిక్ మందులు, బయోసిమిలర్లకు ప్రస్తుతానికి ఈ సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల తక్కువ ధర ఔషధాల ఎగుమతులకు ప్రస్తుతానికి ఢోకా లేదు. ఏడాది తర్వాత జెనరిక్ దిగుమతులను కూడా జాతీయ భద్రతా చట్రం కింద సమీక్షిస్తామని వైట్ హౌస్ ప్రకటించడం భారత్‌కు హెచ్చరిక వంటిదే. ఇది భవిష్యత్తులో సంక్లిష్ట జెనరిక్‌లు, ఇంజెక్టబుల్స్‌పై ప్రభావం చూపవచ్చు. అమెరికా ఇచ్చే ప్రోత్సాహకాలతో భారతీయ కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి కేంద్రాలను భారత్ నుండి అమెరికాకు తరలించే ప్రమాదం ఉంది. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, బయోకాన్ వంటి సంస్థలు పేటెంట్ ఉత్పత్తుల జోలికి వెళ్తే భారీ ధరల ఒత్తిడిని లేదా నిబంధనల ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
మొత్తానికి, అమెరికా తీసుకున్న ఈ 'అమెరికా ఫస్ట్' నిర్ణయం ప్రపంచ ఔషధ మార్కెట్‌లో పెను మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది. భారత ఫార్మా రంగం(pharma-company) ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Follow Us