/rtv/media/media_files/2026/05/20/gautham-adani-2026-05-20-06-53-09.jpg)
Trump administration ends civil, criminal cases against Adani after $10 billion investment promise
భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. లంచం ఆరోపణలతో పాటు, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఉల్లంఘించి గ్యాస్ కొనుగోలు చేశారనే వివాదాస్పద కేసు సైతం పరిష్కారమైంది. అమెరికా పెట్టుబడిదారులు, బ్యాంకుల నుంచి నిధులు సేకరించే క్రమంలో సమాచారాన్ని దాచారనే ఆరోపణలపై గత వారమే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సివిల్ కేసు సెటిల్‌మెంట్ అయ్యింది. అయితే ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా అమెరికా సర్కార్ తాజాగా ఉపసంహరించుకోవడంతో అదానీ గ్రూప్‌నకు పెద్ద ఊరట లభించింది.
Also Read: బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాధి విజృంభణ... 450 మందికి పైగా చిన్నారులు మృతి
ఈ కేసుల పరిష్కారానికి అదానీ గ్రూప్ అమెరికాలో ప్రకటించిన భారీ పెట్టుబడులే ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యక్తిగత న్యాయవాదిగా ఉంటూనే, ఈ కేసులో అదానీ తరఫు నుంచి వాదించిన లాయర్ గత నెలలో అమెరికాలోని కోర్టుకు కీలక విషయాలు తెలిపారు. అదానీ గ్రూప్ అమెరికాలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.95,000 కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందన్నారు. కానీ ఈ కేసుల వల్లే ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను సోమవారం అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అయితే ఈ కేసులు పరిష్కరించేందుకు అదానీ గ్రూప్ భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించడానికి ఒప్పుకుంది. ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన కేసు పరిష్కారానికి గానూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 275 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే లంచం ఆరోపణల సివిల్ కేసుకు సంబంధించి వ్యక్తిగత పూచీకత్తు కింద గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, ఆయన బంధువు సాగర్ అదానీ కూడా 12 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. గతంలో భారత్‌లో సౌర విద్యుత్ ప్లాంట్ పర్మిషన్ కోసం ఇక్కడున్న అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం సమాచారం దాచారాని.. ఆ తర్వాత అమెరికా మార్కెట్ నుంచి 3 బిలియన్ డాలర్ల నిధులు సేకరించినట్లు ఈ కేసులోని ప్రధాన ఆరోపణలుగా ఉన్నాయి. తాజాగా ఆయనపై అమెరికా ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us