/rtv/media/media_files/2026/04/10/the-decades-long-diplomatic-war-between-israel-and-pakistan-2026-04-10-16-00-37.jpg)
The Decades Long Diplomatic War Between Israel and Pakistan
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా విమర్శించారు. ఆ దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా దీనిపై స్పందించింది. పాకిస్థాన్‌ను టెర్రరిస్టు స్టేట్‌గా పేర్కొంది.
ఇక వివరాల్లోకి పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్‌లో ఇజ్రాయెల్‌ను విమరిస్తూ పోస్టు చేశారు. '' ఇజ్రాయెల్ మానవాళికి శాపంగా ఉంది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతుంటే లెబనాన్‌లో మారణహోమానికి పాల్పడుతోంది. ఇజ్రాయెల్ చర్యల వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు. తొలుత గాజా, ఆ తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. యూరోపియన్ యూదుల నుంచి విముక్తి పొందడం కోసం పాలస్తీనా భూభాగంలో ఈ క్యాన్సర్ లాంటి దేశాన్ని (ఇజ్రాయెల్‌ను) సృష్టించిన వాళ్లు నరకంలో కాలిపోవాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నానని'' ట్వీట్ చేశారు. దీనిపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ఆసిఫ్ ఈ పోస్టును తొలగించారు.
పాక్ రక్షణశాఖ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ నాశనం కావాలని ఆయన పిలుపునివ్వడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్న దేశం ఇలాంటి ప్రకటన చేయడం సహించలేనిదని మండిపడింది. మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా ఖవాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. యూదుల దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చడం వాళ్ల వినాశనానికి పిలుపునివ్వడమేనని హెచ్చరించారు. తమ నాశనాన్ని కోరుకునే ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని మండిపడ్డారు. దీంతో ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య గొడవ ఇప్పటిదా కాదు. చాలా ఏళ్ల నుంచి ఉంది.
ఇజ్రాయెల్-పాకిస్థాన్ గొడవ ఎప్పుడు మొదలైంది ?
ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య గొడవ దశాబ్దాలు క్రితమే మొదలైంది. 1947లో మతం ప్రాతిపదికన పాకిస్థాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఏర్పడింది. కానీ అరబ్ దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్.. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించేందుకు నిరాకరించాయి. అప్పుడు ఈ అరబ్ దేశాలకు పాకిస్థాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించేందుకు ఒప్పుకోలేదు.
1967లో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేయనప్పటికీ అరబ్ దేశాలకు సపోర్ట్ చేసింది. ఆ దేశాల తరఫున పాకిస్థాన్ పైలట్లు యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1973లో కూడా యుద్ధం జరగగా పాక్ వైమానిక దళం సిరియా, ఈజిప్టుకు మద్దతుగా నిలిచింది. దీంతో ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది.
పాక్ అణు కేంద్రంపై దాడికి ప్లాన్
1981లో ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఒపెరా అనే పేరుతో ఇరాక్‌లోని అణు రియాక్టర్‌ను ధ్వంసం చేసింది. ఆ సమయంలో పాకిస్థాన్ అణుబాంబులు తయారుచేస్తుండటంతో ఇజ్రాయెల్ ఫోకస్ పాకిస్థాన్ వైపు మళ్లింది. ఒకవేళ పాకిస్థాన్ అణుబాంబులు తయారుచేస్తే ఇది అరబ్ దేశాలకు కూడా చేరుతుందని.. ఇది ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారుతుందని వాళ్లు భావించారు. దీంతో పాక్‌లో ఉన్న కహుటా అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసద్ భావించింది.
భారత్‌తో సంప్రదింపులు
పాక్ అణు కేంద్రంపై దాడి చేయాలంటే ఇజ్రాయెల్ విమానాలకు ఇంధనం నింపుకునేందుకు లేదా ల్యాండ్ అవ్వడానికి ఒక బేస్ కావాలి. ఇందుకోసమే ఇజ్రాయెల్ భారత్‌ను సంప్రదించింది. అయితే గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌పోర్టును వాడుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. దీనికి బదులాగా పాకిస్థాన్ అణు రహస్యాలను, అత్యాధునిక యుద్ధ సాంకేతికతను భారత్‌కు అందిస్తామని ఇజ్రాయెల్ ఆఫర్ చేసింది. కొన్ని రిపోర్టుల ప్రకారం.. భారత వైమానిక దళం (IAF) అధికారులు ఈ దాడికి సంబంధించిన బ్లూప్రింట్‌ను కూడా రెడీ చేశారు.
ఆచితూచి వ్యవహరించిన ఇందిరాగాంధీ
కానీ అప్పటికే భారత్-ఇజ్రాయెల్ ప్లాన్ గురించి అమెరికా నిఘా సంస్థ CIAకు తెలిసింది. అప్పట్లో పాకిస్థాన్‌కు అమెరికా మిత్రదేశంగా ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు జియా-వుల్-హక్‌ను హెచ్చరించింది. దీంతో పాకిస్థాన్ కహుటా అణు కేంద్రం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఒకవేళ భారత్ తమపై దాడులు చేస్తే.. తాము ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC) పై విరుచుకుపడతాని పాకిస్థాన్ హెచ్చరించింది. దీంతో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే భారత్, పాక్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని ఆమె భావించారు. ఒకవేళ దాడి విఫలమైతే అంతర్జాతీయంగా భారత్ దోషిగా నిలబడాల్సి వస్తుందని అనుకున్నారు. అందుకే ఇజ్రాయెల్‌తో కలిసి పాక్ అణుకేంద్రంపై దాడులు చేసే విషయంలో ఆమె వెనక్కి తగ్గారు.
ముస్లిం దేశాల శత్రువుగా ఇజ్రాయెల్‌పై ముద్ర
మొత్తానికి ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చకపోయినప్పటికీ..ఇది భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారానికి పునాది వేసింది. 1999లో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ భారత్‌కు సాయం చేసింది. మంచు కొండల్లో దాక్కున్న పాక్ చొరబాటుదారులను గుర్తించడానికి ఇజ్రాయెల్ తన నిఘా డ్రోన్లను భారత్‌కు పంపించింది. శత్రువుల స్థావరాలను కచ్చితత్వంతో నాశనం చేసే లేజర్ టెక్నాలజీని అందిచింది. దీంతో ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య వివాదం మరింత ముదిరింది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్.. ఇజ్రాయెల్‌ను "ముస్లిం దేశాల శత్రువు" అంటూ ముద్ర వేసింది. ఇద్దరు శత్రువులు (భారత్, ఇజ్రాయెల్) కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ తమ దేశ పాస్‌పోర్ట్ విషయంలో కూడా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత చూపిస్తోంది. పాక్ పాస్‌పోర్ట్‌పై ''ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇది చెల్లుబాటు అవుతుంది'' అని రాసి ఉంటుంది. దీని ప్రకారం పాకిస్థాన్ పౌరుడు చట్టబద్ధంగా తన పాస్‌పోర్ట్‌తో ఇజ్రాయెల్‌కు వెళ్లలేడు. ఒకవేళ ఎవరైనా ఇతర దేశాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి వెళ్తే.. వాళ్ల పాక్ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు. అంతేకాదు పాక్ రాజ్యంగంలో కూడా ఇజ్రాయెల్‌ను ఒక అక్రమ దేశంగా పరిగణించారు. అందుకే ఇజ్రాయెల్-పాకిస్థాన్ మధ్య వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతోంది. తాజాగా లెబనాన్ విషయంలో పాకిస్థాన్-ఇజ్రాయెల్ మధ్య వివాదం మరోసారి ముదరడం చర్చనీయమవుతోంది.
Follow Us